గానగంధర్వులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణానంతరం భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒక్కొక్కరుగా ప్రముఖులు కేంద్రాన్ని ఈ మేరకు కోరుతున్నారు. వివిధ భారతీయ భాషల్లో 40,000 వరకు పాటలు పాడి, భారతీయుల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయిన బాల సుబ్రహ్మణ్యానికి భారత రత్నను ఇచ్చి గౌరవించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఇదే విన్నపంతో రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశారు ప్రముఖ సినీనటి, మాజీ ఎంపీ జయప్రద.
భారతరత్న బాలుకి ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్న జయప్రద.. సినీ సంగీతానికి, భారత చలనచిత్ర పరిశ్రమకు బాలు ఎనలేని సేవలు చేశారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. అటు, ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ ఎస్పీబీకి భారతరత్న ఇవ్వాలని మొట్టమొదట డిమాండ్ చేయడమే కాకుండా కేంద్రానికి లేఖ రాసినందుకు సీఎం జగన్ తన కృతజ్ఞతలు తెలిపారు. బాల సుబ్రహ్మణ్యంకి భారత రత్న ఇవ్వాలంటూ బెంగళూరుకి చెందిన బాలు అభిమాని గిరీష్ కుమార్ చేంజ్.ఓఆర్జీ ద్వారా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ద్వారా ఆయన సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు.