ఏలూరులో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డం, తదనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి సమీక్ష జరిపారు. కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులు, అధికారులతో సీఎం కొంచెం సేపటి క్రితం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోగాలకు సంబంధించి కారణాలను నిర్ధారించడానికి సమగ్ర పరీక్షలు చేస్తున్నామని ఈ సందర్భంగా వైద్య బృందాలు, నిపుణులు ముఖ్యమంత్రికి వెల్లడించాయి. ప్రాథమికంగా సీసం, ఇంకా ఆర్గనో క్లోరిన్‌పై అనుమానాలు ఉన్నాయని.. అయితే, ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, బాధితులు త్వరగా కోలుకుంటున్నారని సీఎంకు సభ్యులు వివరించారు. బదులుగా నిశిత పరిశీలన, అధ్యయనం చేసి కచ్చితమైన కారణాలు కనుక్కోవాలని సీఎం వైద్య బృందాల్ని కోరారు. శుక్రవారం మరోసారి వీరందరితో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్‌ఐఎన్, ఐఐసీటీ, ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ మంగళగరి, డబ్ల్యూహెచ్‌ఓ, సీసీఎంబీకి చెందిన నిపుణులు, వైద్యులు పాల్గొన్నారు.