శ్రీశైలం ఆలయంలో ఇంటిదొంగల అవినీతి బండారం బయటపడింది. అధికారుల అలసత్వాన్ని ఎలా క్యాష్ చేసుకున్నారనేదానిపై ఏసీబీ కూపీలాగింది. శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు దోచుకున్న సొమ్మును పైసాతోసహా లెక్క తేల్చింది. రేపోమాపో నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
శ్రీశైలం ఆలయంలో జరిగిన ఉద్యోగుల దోపిడీ దందాపై ఏసీబీ నివేదిక సిద్ధం చేసింది. కోవిడ్ కారణంగా కాస్తా ఆలస్యమైనా.. రిపోర్ట్ పకడ్బందీ తయారు చేసినట్లు తెలుస్తోంది. రెండున్నర కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
పవిత్రమైన ఆలయంలో అడుగడునా అవినీతి జరిగింది. దర్శనం, అభిషేకం టిక్కెట్లు, ప్రసాదం డొనేషన్, అకామిడేషన్ కౌంటర్లలో జరిగిన అవినీతితో పాటు పెట్రోల్ బంక్, టోల్‌గేట్ నిర్వహణలో భారీ అవినీతి జరిగినట్లు తేల్చారు. 34 మంది ఉద్యోగులను ఇందులో పాత్రదారులుగా గుర్తించి.. క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 11 మంది ఆలయ ఉద్యోగులు అధికారులు సస్పెండ్ కాగా.. మిగతా 23 మంది తాత్కాలిక ఉద్యోగులు అరెస్టై.. బెయిల్‌పై వచ్చారు. దోచుకున్న సొత్తులో ఇప్పటి వరకు 83 లక్షల రూపాయల నగదు రికవరీ చేశారు.
2017 నుంచి మార్చి 2020 వరకు జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏసీబీ విచారణ కంటే ముందే విచారణ అధికారిగా ఉన్న ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావు, ఈఓ రామారావులు తమ ఎంక్వైరీలో రెండున్నర కోట్ల అవినీతి జరిగిందని తేల్చారు. సాఫ్ట్‌వేర్ మార్చి అవినీతికి పాల్పడ్డినట్లు తేల్చారు.
ఒక ఉద్యోగి ఒక కౌంటర్‌లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేస్తే.. 10 గంటల వరకే పనిచేసినట్లు చూపి.. మిగిలిన సమాచారాన్ని కంప్యూటర్ లో డిలీట్ చేశారు. మిగతా రెండు గంటల్లో విక్రయించిన టికెట్లు, ప్రసాదాలు, ఇతరత్రా వచ్చిన ఆదాయం మొత్తం తమ జేబుల్లో వేసుకున్నారు. ఈ సమాచారం అంతా బ్యాకప్‌లో ఉండటంతో దోపిడీ వ్యవహరం బయటపడింది.
ఆలయ అధికారులు రోజువారీగా బ్యాకప్ చెక్ చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది ఏసీబీ అధికారుల అభిప్రాయం. బ్యాకప్ పరిశీలిస్తే.. ఏ ఉద్యోగి ఏ రోజు ఎంత తిన్నాడనేది అప్పుడే తెలిసిపోయేది. తాత్కాలిక ఉద్యోగుల నుంచి తిన్న మొత్తాన్ని ఒకే రోజు రికవరీ చేయడం కష్టంగా మారింది. సాఫ్ట్‌వేర్ మార్చడంతో పాటు అవినీతి జరగకుండా ఏం చేయాలనే దానిపై కూడా ఏసీబీ అధికారులు తమ నివేదికలో అందజేయనున్నారు.
తాత్కాలిక ఉద్యోగులంతా.. ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్‌లకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అందించే ఏజెన్సీ ద్వారా నియమించబడిన వారే. దీంతో అవినీతికి సంబంధిత బ్యాంకులు కూడా బాధ్యత వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే బ్యాంకర్ల వాదన మరోలా ఉంది. ఉద్యోగులు తమవాళ్లే కావచ్చు.. కానీ డ్యూటీ చేయించింది శ్రీశైలం ఆలయ అధికారులు కదా అంటూ వారు కౌంటర్ ఇస్తున్నారు.