తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులోకి జబర్ధస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రి ఇచ్చి దాదాపు 90 రోజులు హౌస్‌లో కొనసాగాడు. అంతేకాకుండా ఇంట్లో తనకున్న కామెడీ ప్రతిభతో ఇంట్లో వాళ్ళనే కాకుండా ఇటు ప్రేక్షకులకు కూడా ఆనందాన్ని పంచాడు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చేందుకు అవినాష్ జబర్దస్త్ నిర్మాతలకు 10 లక్షల రూపాయాలు చెల్లించాడు. కానీ బిగ్‌బాస్ ద్వారా అంతకు మించి డబ్బు సంపాదించినట్లుగా తెలుస్తోంది. బిగ్‌బాస్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ కొన్ని విషయాలను పంచుకున్నాడు. సోషల్ మీడియాలో అరియానా గ్లోరితో వివాహం అంటూ వస్తున్న రూమర్స్‌ను అతను ఖండించాడు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తర్వాతి చిత్రాల్లో మంచి పాత్ర ఇస్తానని తనకు ప్రామిస్ చేసినట్లుగా తెలిపాడు. బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా వచ్చాడు. అదే సమయంలో తనను కలిసిన డైరెక్టర్ అనిల్ తన రాబోయే సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు.. ఒక సారి తనను కలవమని చెప్పినట్లుగా అవినాష్ వివరణ ఇచ్చాడు.