ఎన్నో కాంట్రవర్సీల నడుమ ప్రారంభమయ్యి.. బుల్లితెరలో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ దక్కించుకుని.. ఫ్యాన్స్‌కు కావల్సినంత వినోదం, స్పైసీనెస్ అందించింది బిగ్ బాస్ 3. గత సీజన్లతో పోలిస్తే.. ఈ సీజన్‌లో ఎంటర్టైన్మెంట్ కాసింత తక్కువైందని అందరూ పెదవి విరిచినా.. అనేక మలుపులు, సస్పెన్స్ మధ్య ఈ రియాలిటీ షో చివరి అంకంకు చేరుకుంది. కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు తన వైవిధ్యమైన హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ.. షోకి కట్టిపడేసేలా చేశారు. ఇకపోతే ఈ ఆదివారంతో షో ముగియనుండగా.. టైటిల్ విజేత ఎవరవుతారనే దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజాలు ఫైనల్ ఫైవ్‌లో ఉండగా.. అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడం విశేషం.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ విన్నర్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. ఫ్యాన్స్ అందరూ కూడా తమ నటులను గెలిపించడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే నెట్టింట్లో హాల్‌చల్ చేస్తున్న అనధికారిక పోల్స్‌ను పరిశీలిస్తే.. శ్రీముఖి, వరుణ్, రాహుల్‌ల మధ్య టఫ్ ఫైట్ నడిచేలా కనిపిస్తోంది.
షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్‌తో అలరించిన బాబా భాస్కర్.. హౌస్‌లోనే టాప్ పెరఫార్మెర్‌గా పేరు తెచ్చుకున్న అలీ రెజాల టైటిల్ ఆశలు గల్లంతయినట్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓటింగ్ శాతం బట్టి ఇద్దరూ కూడా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
శ్రీముఖి… గత సీజన్లలోని ఫిమేల్ కంటెస్టెంట్లతో పోలిస్తే ఈసారి శ్రీముఖి ప్రతి టాస్క్‌లోనూ గట్టి పోటీనిస్తూ వచ్చింది. అంతేకాకుండా బయట ఆమెకున్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీముఖి ప్రతిసారి డేంజర్ జోన్ లోకి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఫ్యాన్స్ ఆమెకు భారీ మెజార్టీ అందిస్తూ వచ్చారు. ఇక ఈసారి ఆమెను టైటిల్ విజేతగా నిలపడానికి ‘శ్రీముఖి ఆర్మీ’ సోషల్ మీడియా వేదికగా భారీగా ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం ఓటింగ్ చూసుకుంటే.. శ్రీముఖి మూడో స్థానంలో ఉంది.
వరుణ్ సందేశ్… మొదట్లో తోటి ఇంటి సభ్యులతో చిన్న చిన్న గొడవలు పడిన వరుణ్ సందేశ్.. ఆ తర్వాత మెల్లిగా తనను తాను మార్చుకుని మంచోడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రతి టాస్క్‌లోనూ 100% ఎఫర్ట్ పెడుతూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇది ఒక ఎత్తయితే.. భార్య వితికతో అప్పుడప్పుడూ చేసిన రొమాన్స్‌లు కూడా ఒక వర్గానికి బాగా నచ్చాయని చెప్పొచ్చు. ప్రస్తుతం పోలింగ్‌లో వరుణ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
రాహుల్ సిప్లిగంజ్… షో స్టార్టింగ్‌లో రాహుల్ టాప్ 5లోకి ఎంటర్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. వరుణ్, వితిక, పునర్నవిలతో ఉంటూ.. దాదాపు కొన్ని ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. అంతేకాకుండా రాహుల్ అప్పుడప్పుడు మాస్ పాటలతో ప్రేక్షకులను అలరించాడు. మరోవైపు పునర్నవి సేవ్ కావడానికి.. రాహుల్‌ను వాడుకుంటోందనే టాక్ కూడా నడించింది. అయితే పునర్నవి ఎలిమినేట్ కావడం.. రాహుల్ గ్రాఫ్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరడం అనుకోకుండానే జరిగిపోయాయి. ఇకపోతే బిగ్ బాస్ ఇచ్చిన టికెట్ టు ఫినాలే టాస్క్‌లో గెలిచి రాహుల్ మొదటిగా ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో అతని ఫ్యాన్స్ ఎలాగైనా టైటిల్ విజేతను చేయాలని భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ ఓటింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.