బిగ్ బాస్ 3 ప్రారంభంకాక ముందు నుంచే వివాదాస్పదం అయింది. నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోకు మొదటి నుంచి ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అంతే కాదు బిగ్ బాస్ ఇంటి సభ్యులు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. దీంతో షోకి ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగా పెరుగుతోంది. కాగా, నిన్నటి ఎపిసోడ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో సందడిగా సాగాయి. తాజాగా ఈ ఎపిసోడ్‌లో స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం లాంటి అంశాలపై కంటెస్టెంట్స్ మధ్య ఓ రేంజ్‌లో చర్చలు జరిగాయి. ఆడవాళ్లు గొప్పనా.. లేక మగవాళ్లు గొప్పనా అనే అంశంపై బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య చర్యలు గొడవకు దారి తీశాయి. ఈ విషయంలో ఎవరి వాదన వారు వినిపించారు. మగవాళ్లు ఎంతమందితోనైనా మాట్లాడొచ్చు.. ఎవరితోనైనా ఉండొచ్చని రవి, మహేష్ అనగా.. అందుకు వితికా, ఆషు, పునర్నవిలు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఆడవాళ్లు మగవారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని.. పెళ్లి చేసుకున్నామనే ఒక కారణంతో పుట్టింటిని వదిలేసి వస్తారని అన్నారు. ఇక వితిక ఐతే.. సమాజంలో ఆడవాళ్ల అణిచివేతపై ఓ రేంజ్‌లో ఎమోషనల్ అయింది. మరోవైపు పునర్నవి మాట్లాడుతూ.. ఓ అబ్బాయి వెళ్లి నలుగురు అమ్మాయిలతో మాట్లాడితే ఎవరు ఏమి అనరు. అదే అమ్మాయి వెళ్లి అబ్బాయితో మాట్లాడితే.. క్యారెక్టర్ లెస్ అని ముద్రవేస్తారు. ఇది నేటి సమాజం అమ్మాయిలకు ఇస్తున్న గౌరవం అంటూ పునర్నవి కాస్తంత ఎమోషనల్ అయింది. దీంతో నిన్నటి ఎపిసోడ్ కాస్త చర్చలతో ముగిసింది.