Big News Big Debate: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో AP రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. భవిష్యత్తు పొత్తులపై రచ్చ రచ్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అంతా ఏకం కావాలంటూ ఇచ్చిన పిలుపుపై పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. జనసేన నోట చంద్రబాబు మాట బయటపడిందని YCP ఆరోపిస్తుంటే.. పొత్తులపై ఇంకా చర్చించలేదంటోంది తెలుగుదేశం. అటు అధిష్టానమే అంతా చూసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము ప్రకటించారు.
2024 ఎన్నికలకు పవన్ కల్యాణ్ కొత్త ఫార్ములా తెరమీదకు తీసుకొచ్చారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న జనసేనాని సొంత ప్రయోజనాలు వదిలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అందరూ ఏకతాటిపైకి రావాలంటున్నారు.
పవన్ రాజేసిన మంట ఏపీ రాజకీయాల్లో దావానలంగా వ్యాపించి కార్చిచ్చుగా వ్యాపిస్తోంది. అన్ని పార్టీల్లో సెగలు రేపుతోంది. పొత్తులపై చర్చ కాస్త రచ్చగా మారింది. ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని వైసీపీ అంటోంది. తెలుగుదేశం పల్లకి మోయడానికి అన్ని పార్టీలను తీసుకొచ్చే బాధ్యత పవన్ తీసుకున్నాడని విమర్శనాస్త్రాలు సంధిస్తోంది అధికారపార్టీ. కట్టకట్టుకుని వచ్చినా YCP సింగిల్‌గానే వస్తుందని… దమ్ముంటే పవన్ సింగిల్‌గా రావాలని సవాల్ విసురుతోంది.
ప్రజావ్యతిరేక పాలనపై పోరాటమే తమ అజెండా అంటున్న TDP పొత్తులపై పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందని ఫుల్ క్లారిటీతో ఉంది. అయితే గతంలో చంద్రబాబు వన్‌సైడ్ లవ్ కామెంట్లు గుర్తు చేస్తున్నాయి కేడర్. ఇప్పటికే రోడ్‌మ్యాప్ సిద్దంగా ఉందని.. అధిష్టానంతో త్వరలో పవన్ కల్యాణ్ మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారంటూ ఏకవాక్య ప్రకటన చేస్తున్నారు ap bjp చీఫ్ సోము వీర్రాజు. అవసరం అయితే వ్యూహాలు మార్చుకుంటామని గతంలోనే చెప్పిన పవన్ కల్యాణ్ ఆవిర్భావసభలో నిజంగానే తన వైఖరి మార్చుకుని సరికొత్త ఫార్ములాతో వచ్చారు. మరి ఆయనతో కలిసి నడిచే పార్టీలేంటి? ఆయన కోరుకుంటున్న ఫ్రంట్ సాధ్యమేనా?
– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్
ఈ అంశంపైనే టీవీ మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్ డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..