Big News Big Debate: వరద బీభత్సంతో నామరూపాల్లేకుండా పోయిన గ్రామాలు.. ఈ విపత్తు మానవతప్పిదమా..?

|

Nov 25, 2021 | 9:02 PM

రదలతో అల్లాడిన రాయలసీమలో రాజకీయ క్రీడ మొదలైంది. సవాళ్లు ప్రతిసవాళ్లు. విమర్శలు. కౌంటర్‌ విమర్శలతో వేడెక్కింది ఏపీ రాజకీయం.

Big News Big Debate: వరద బీభత్సంతో నామరూపాల్లేకుండా పోయిన గ్రామాలు.. ఈ విపత్తు మానవతప్పిదమా..?
Big News Big Debate
Follow us on

Big News Big Debate: వరదలతో అల్లాడిన రాయలసీమలో రాజకీయ క్రీడ మొదలైంది. సవాళ్లు ప్రతిసవాళ్లు. విమర్శలు. కౌంటర్‌ విమర్శలతో వేడెక్కింది ఏపీ రాజకీయం. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ నాయకులు జోలపట్టి నిధులు సమీకరిస్తున్నారు. మరోవైపు విపత్తులో ఆదుకోవాలంటూ ప్రధానికి లేఖ రాశారు CM జగన్‌. వరద ప్రాంతాల్లోనే మకాం వేసిన చంద్రబాబు ప్రాణనష్టం అంతా కూడా ప్రభుత్వ హత్యలే అంటున్నారు. హత్యలంటే ఇవి కాదని.. నాడు పుష్కరాల్లో టీడీపీ ప్రభుత్వం చేసింది అసలైన హత్యలని కౌంటర్‌ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు.

ఇప్పటికీ కొన్ని వరద నీటిలోనే ఉన్నాయి. మరికొన్ని చోట్ల సర్వం కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. పరామర్శలకు వచ్చే వారికి బాధలు చెప్పడమే కానీ.. వారికి ఓదార్పు లభించడం లేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాజకీయ పార్టీల యాత్రలు కూడా మొదలయ్యాయి. ఎవరికి వారు బృందాలుగా పోయి బాధితులను ఓదార్చే ప్రయత్నం చేస్తునే.. పనిలో పనిగా రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో 3 రోజులుగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనంటున్నారు. మానవతప్పిదం వల్లే విపత్తు సంభవించిందని.. జుడీషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు టీడీపీ బాస్‌. మృతుల కుటుంబాలకు 25లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

వరదలపై జుడీషియల్‌ విచారణ జరిపించాలని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా… గోదావరి పుష్కరాల్లో మరణాల సంగతేంటని ప్రశ్నించారు. ఇప్పటికే వర్షాలు, వరదలతో ఇబ్బందిపడుతున్న జనం దగ్గరకు వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే CM జగన్‌ వెళ్లలేదని.. త్వరలోనే బాధితులను కలుస్తారన్నారు మంత్రి కొడాలి నాని. ప్రాజెక్టుల సామర్థ్యానికి మించి వరద రావడంతోనే విపత్తు సంభవించిందని విపక్షాలు బురదరాజకీయం మానుకోవాలన్నారు మంత్రి.

అటు వరద నష్టం అంచనా కోసం ప్రభుత్వం ఇంతవరకు సర్వే బృందాలను పంపలేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు ప్రకటించడం కంటి తుడుపు చర్యే అన్నారు. వరద బాధితుల కోసం నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టింది BJP. రెండు నెలల క్రితం విపత్తు నిధులు ఇస్తే ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలన్నారు ఎంపీ జీవీఎల్‌.

అటు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న జనసేన కూడా ప్రభుత్వ తీరును తప్పబట్టింది. టోటల్‌ గా ఏపీలో ఇప్పుడు వరద చుట్టూ రాజకీయం చక్కర్లు కొడుతోంది. మరి విమర్శలు ప్రతివిమర్శలతో బాధితులకు న్యాయం జరుగుతుందా? పార్టీలు ఈ కష్టకాలంలో కూడా రాజకీయాలు చేయాలా.?

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)

ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి..