
Recurring Nightmares Meaning Telugu: ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో పీడకలలు కూడా ఒకటి. ముఖ్యంగా కొందరికి ఒకే రకమైన కలలు పదేపదే వస్తుంటాయి. కలలో పరీక్షకు వెళ్లి సమాధానాలు రాకపోవడం, ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడిపోవడం, ఎవరో వెంటాడుతుండటం, ప్రమాదంలో చిక్కుకోవడం వంటి అనుభవాలు నిద్రలో భయాందోళనలకు గురిచేస్తాయి. నిద్రలేచిన తర్వాత కూడా ఆ కలలు గుర్తుకొచ్చి మనసును కలవరపెడుతుంటాయి. అయితే ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి? వీటి వెనుక ఏవైనా మానసిక లేదా ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయా?
కొన్ని అధ్యయనాల ప్రకారం, 75 శాతానికి పైగా వయోజనులు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా పునరావృతమయ్యే కలలను అనుభవించినట్లు చెబుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వీటికి ప్రధాన కారణాల్లో పరిష్కారం కాని ఒత్తిడి, ఆందోళన, గతంలో ఎదురైన చేదు అనుభవాలు ముఖ్యమైనవి.
రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కుటుంబ కలహాలు, ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై భయాలు మనసుపై ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఈ సమస్యలను బయటకు చెప్పుకోలేకపోవడం లేదా వాటికి పరిష్కారం కనుగొనలేకపోవడం వల్ల ఆందోళన మనసులో పేరుకుపోతుంది. ఈ భావోద్వేగాలు నిద్ర సమయంలో కలల రూపంలో బయటపడవచ్చు. ఉదాహరణకు.. పరీక్షకు సిద్ధం కాకపోవడం, వాహనంపై నియంత్రణ కోల్పోవడం, ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోవడం, ఎవరో వెంబడించడం వంటి కలలు భయం, అభద్రతాభావం లేదా ఒత్తిడితో ముడిపడి ఉండవచ్చు. అయితే ప్రతి కలకు ఒకే అర్థం ఉంటుందని చెప్పలేము.
జీవితంలో ఎదురైన ప్రమాదాలు, సన్నిహితులను కోల్పోవడం, తీవ్రమైన మానసిక గాయాలు కొందరిని చాలా కాలం వెంటాడుతుంటాయి. ఇలాంటి అనుభవాలు కొంతమందిలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఈ పరిస్థితుల్లో బాధాకరమైన సంఘటనలకు సంబంధించిన కలలు పదేపదే రావచ్చు. వీటితో పాటు క్రమరహిత నిద్ర వేళలు, నిద్రలేమి, స్లీప్ అప్నియా వంటి నిద్ర సంబంధిత సమస్యలు కూడా పీడకలలకు కారణం కావచ్చు. కొన్ని రకాల రక్తపోటు, మానసిక ఆరోగ్య మందుల దుష్ప్రభావాలు కూడా కలలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
అప్పుడప్పుడు పీడకలలు రావడం సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి తరచుగా వస్తూ నిద్రకు భంగం కలిగిస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు.
(Disclaimer: ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. పదేపదే పీడకలలు రావడం అంటే తప్పనిసరిగా ఏదో తీవ్రమైన మానసిక సమస్య ఉన్నట్లు కాదు. అయితే అవి మీ నిద్ర, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంటే వాటి వెనుక ఉన్న కారణాలను గుర్తించి తగిన వైద్య సహాయం తీసుకోవడం మంచిది.)