Shubha Yoga
అకస్మాత్తుగా, ఊహించని విధంగా శుభ ఫలితాలనివ్వడంలో, శుభ యోగాలనివ్వడంలో రాహు కేతువులను మించినవారు లేరు. ప్రస్తుతం రాహువు మీన రాశిలోనూ, కేతువు కన్యారాశిలోనూ సంచరిస్తున్నారు. అందులోనూ రాహువు రేవతి నక్షత్రంలోనూ, కేతువు చిత్తా నక్షత్రంలోనూ సంచరించడం జరుగుతోంది. దీనివల్ల ఆరు రాశుల వారికి అకస్మాత్తుగా డబ్బు కలిసి రావడం, ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం, గృహ, వాహన సౌకర్యాలు అమరడం, చేయూత దొరకడం వంటివి జరుగుతాయి. ఈ రాశుల వారి జీవితాల్లో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సుమారు మూడు నెలల పాటు ఈ అనుకూలతలు అనుభవానికి వస్తాయి. ఆ ఆరు రాశులుః మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం.
- మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో సంచరిస్తున్న కేతువు కారణంగా ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఎటువంటి ఒత్తిడి నుంచయినా బయటపడడం జరుగుతుంది. అనుకోకుండా కుటుంబ సభ్యులతో పుణ్య క్షేత్ర సంద ర్శనకు కూడా అవకాశం ఉంది. ఊహించని విధంగా కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవు తుంది. తల్లి వైపు బంధువులు లేదా మావగారి ద్వారా చేయూత అంది, పైకి రావడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. ప్రమోషన్లకు సంబంధించిన ఆటంకాలు, పోటీలు తొలగిపోయి, మార్గం సుగమం అవుతుంది. ఏ రంగంలో ఉన్నప్పటికీ ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. లాటరీలు, జూదాలు, ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, షేర్లు, వడ్డీల వంటివి బాగా కలిసి వస్తాయి. జ్యేష్ట సోదరుల నుంచి కానీ, కొందరు ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి కానీ చేయూత అందుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో సంచరిస్తున్న కేతువు కారణంగా ఏ విషయంలోనైనా శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రమోషన్లు ఉంటాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం వల్ల వారి ద్వారా పైకి రావడం జరుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా ఆర్థికంగా లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.
- తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఆర్థిక సమస్యలన్నీ పూర్తి పరిష్కారం కావడంతో పాటు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. సహాయం తీసుకునే స్థాయి నుంచి సహాయం చేసే స్థాయికి చేరుకుంటారు. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్లు మటు మాయం అయి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో దూసుకుపోతారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. అధికారుల కారణంగా బాగా పైకి వస్తారు.
- వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో సంచరిస్తున్న కేతువు కారణంగా ఊహించని లాభాలు, ఊహించని ఆదాయం సాధ్యమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. ఆక స్మిక ధన లాభ సూచనలున్నాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇష్టమైన పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. జ్యేష్ట సోదరుల కారణంగా జీవితంలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో డిమాండు పెరిగి లాభాల బాటపడతాయి.
- మకరం: ఈ రాశివారికి తృతీయంలో రాహువు కారణంగా అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. చిన్ననాటి మిత్రుల ద్వారా పేరు ప్రఖ్యాతులు పెరగడంతో పాటు వృత్తి, ఉద్యోగాల పరంగా కూడా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి దినదినాభివృద్ధి చెందుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.