శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు – కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయం 8, వ్యయం 14 | రాజపూజ్యాలు 3, అవమానాలు 5
ఈ రాశికి ఉగాది నుంచి ధన, కుటుంబ స్థానంలోకి శని ప్రవేశించడం వల్ల రెండవ దశ ఏలిన్నాటి శని ప్రారంభం అవుతుంది. ఆర్థిక, కుటుంబ సమస్యలకు, ఒత్తిళ్లకు అవకాశం ఉంది. ఆర్థిక వ్యవ హారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మాట తొందరపాటు వల్ల సమస్యలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో ఖర్చులు పెరగడం, ఆటంకాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ఆస్తి వివాదాలు జటిలంగా మారే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా మందగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి.
మే 25న గురువు పంచమ స్థానంలోకి మారుతున్నందువల్ల ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు, చదువులకు అవకాశం ఉంటుంది. వ్యక్తి గత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాఫీగా సాగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి.
మే తర్వాత నుంచి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. గురువు పంచమ కోణంలో ప్రవేశిస్తున్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సెప్టెంబర్ తర్వాత రెండు మూడు నెలల పాటు అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాక, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు బాగా సానుకూలపడతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయాలు సాధిస్తారు. ఈ రాశివారు శివార్చన చేయించడంతో పాటు తరచూ నవ గ్రహాలకు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది.