Money Horoscope
ఉపచయ స్థానాల్లో కుజుడు సంచారం చేస్తున్నంత కాలం ఆర్థిక పరిస్థితికి ఏమాత్రం లోటుండదు. ఉపచయాలంటే ధన వృద్ధి స్థానాలు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, 3,6,10,11 స్థానాలను ఉపచయ స్థానాలంటారు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కారణం మీద నాలుగు రాశుల వారికి ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఏర్పడడం, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, ఆదాయ మార్గాలు పెరగడం వంటివి కుజుడు ఈ ఉపచయ స్థానాల్లో ఉన్నంత కాలం జరుగుతుంటాయి. ప్రస్తుతం ధనూ రాశిలో ఉన్న కుజుడు ఫిబ్రవరి 5వ తేదీ వరకు కర్కాటకం, తుల, కుంభం, మీన రాశులకు ఆర్థికంగా ఉపయోగపడుతూ ఉంటాడు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి మార్గాలు చూపిస్తూ ఉంటాడు. పైగా ధనూ రాశిలో రెండు శుభ గ్రహాలతో యుతి ఏర్పడినందువల్ల కుజుడు మరింత యాక్టివ్ గా వ్యవహరించి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక కుజుడు మేష, వృశ్చిక రాశులకు అధిపతి కావడం వల్ల, ఈ రెండు రాశుల వారికి భాగ్య, ధన స్థానాల్లో ఉన్నందువల్ల ఆర్థికంగా మేలు చేసే అవకాశం ఉంటుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి ఆధిపత్యం రీత్యా కుజుడు పూర్ణ శుభుడు. ఈ రాశికి ప్రస్తుతం కుజుడు ఆరవ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలపరంగా అంచనాలకు మించిన ఆర్థిక లాభముంటుంది. ముఖ్యంగా డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. వీరి ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎటువంటి ఆటంకాలున్నా, ఎటువంటి సమస్యలున్నా కొద్ది ప్రయత్నంతో తొలగిపోతాయి. తప్పకుండా పదోన్నతికి అవకాశం ఉంటుంది.
- తుల: ఈ రాశికి మూడవ రాశిలో కుజ సంచారం వల్ల అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంటుంది. శత్రు, రోగ, రుణ సమస్యల మీద విజయం సాధిస్తారు. పోటీదార్లు, ప్రత్యర్థులు వెనక్కు తగ్గుతారు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆర్థిక సమస్యలన్నీ చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ప్రయాణాల్లో లాభదాయక పరిచయాలు ఏర్పడుతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.
- కుంభం: ఈ రాశివారికి పదకొండవ స్థానంలో కుజ సంచారం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవు తుంది. లాభ స్థానంలో ఉన్న కుజుడితో శుభ గ్రహాలు చేరడం వల్ల న్యాయమైన మార్గాల ద్వారానే రాబడి బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. భాగస్వాముల వల్ల ఆర్థిక ప్రయోజనాలు అధికం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
- మీనం: ఈ రాశికి ఉద్యోగ స్థానమైన దశమ స్థానంలో కుజ సంచారం వల్ల తప్పకుండా అధికార లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంటుంది. పదోన్నతుల కారణంగా ఆర్థిక లాభం కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రత్యర్థులు, పోటీదార్లు వెనుకడుగు వేస్తారు. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందివస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తున్నవారికి కూడా మంచి అవకాశాలు అందివస్తాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది.
- మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో రెండు శుభ గ్రహాలతో ఉండడం, దాని మీద గురు దృష్టి ఉండడం వల్ల ఈ రాశివారికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ముఖ్యంగా విదేశీ అవకాశాలు అంది వస్తాయి. అంచనాలకు మించిన ధన వృద్ధి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో తిరుగులేని పురోగతి ఉంటుంది.
- వృశ్చికం: ఈ రాశివారికి ధన స్థానంలో రాశ్యధిపతి కుజ సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయ వృద్ధి ఉండే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. సక్రమంగానే కాక, అక్రమంగా కూడా ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరగడం, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. భూ సంబంధమైన ఆస్తి కలిసి వస్తుంది. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సతీమణి ద్వారా కూడా సంపాదన బాగా వృద్ధి చెందుతుంది.