AP Local Body Elections : ఏపీలో నిన్న(మంగళవారం) తొలివిడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 3,244 పంచాయతీలకు గాను, 2,637 పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు గెలిచారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. టీడీపీ అలయన్స్ మద్దతుదారులు కేవలం 508 స్థానాల్లో విజయం సాధించారని బొత్స అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. తటస్తులు 98 మంది గెలిచారని, వాళ్ళు తమవైపే ఉంటారని బొత్స చెప్పుకొచ్చారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ మొత్తం తుడిచిపెట్టుకు పోయిందన్న బొత్స, 38.74 శాతం సీట్లు వచ్చాయని చంద్రబాబు తప్పుడు లెక్కలు చెప్తున్నారని విమర్శించారు. టీడీపీకి కేవలం 15 శాతం మాత్రమే సీట్లు వచ్చాయని బొత్స తేల్చి చెప్పారు. 38.74 శాతం అంటున్న చంద్రబాబు ఎక్కడ గెలిచారో చూపించాలని సవాల్ చేశారు.
“రేపు మా సర్పంచ్ లను ఫొటోలతో సహా చూపిస్తాం. చంద్రబాబు మాయ మాటలు మానుకుని వాస్తవాలు ఒప్పుకోవాలి. చంద్రబాబు చెప్పినట్టు చేసినా ఓటమి తట్టుకోలేక ఎన్నికల సంఘాన్ని తిడుతున్నాడు. చెప్పినవన్నీ చేసినా ప్రజలను మార్చలేకపోయారు. ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్లినా, ఐక్యరాజ్య సమితికి వెళ్ళినా పర్వాలేదు.” అని బొత్స ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో చర్చంతా కొత్త జెండా పైనే, షర్మిళ ఎవరు వదిలిన బాణమని సర్వత్రా మీమాంస.!