ఆంధ్రప్రదేశ్‌లో జమిలి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక అధికార పార్టీలో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంది. ఒక్కసారిగా ఈ స్థాయిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను మారుస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించ ఉండరు. ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి మార్చారు. ఇప్పటికే మొత్తం రెండు విడతలుగా 38 మంది సమన్వయకర్తలను మార్చారు. మరో జాబితా నేడో, రేపో అన్నట్టు ఉంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించగా.. మరికొందరి సీట్లు మార్చారు. ఒకప్పుడు సీఎంవో నుంచి ఫోన్ వస్తేనే ఎగిరి గంతేసే ఎమ్మేల్యేలు ప్రస్తుతం సీఎంవో నుంచి కాల్ వస్తుందంటేనే టెన్షన్ పడి పోతున్నారు. సీఎంవోకి పిలచి ఈ సారి టికెట్ ఇవ్వలేక పోతున్నామని, మీకు టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితులు అక్కడ లేవని, పార్టీ అభ్యర్థి గెలిపించేందుకు కృషి చేయాలని కోరుతుండడం అందరినీ కలవరపరుస్తోంది. మొదటి రెండు జాబితాల్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా సీటు లేకుండా పోయింది.
రెండో విడత జాబితాలో మంత్రి అమర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నుంచి మలసాల భరత్ కు అవకాశం ఇవ్వగా.. మంత్రి అమర్‌కు ఇంకా ఏ స్థానం కేటాయించలేదు. దీంతో అమర్‌ను పార్టీ ఏం చేయబోతోంది అంటూ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఒకానొక దశలో అసలు అమర్ కు టికెట్ ఉంటుందా? ఉండదా ఆన్న చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కొత్త సమన్వయకర్త భరత్ కుమార్ ను పరిచయం చేసే సమావేశంలో మంత్రి అమర్ తీవ్ర భావోద్వేగానికి లోనవడం కూడా అనుమానాలకు మరింత ఊతమిచ్చింది. తాను అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళుతున్నందుకు బాధగా ఉందన్న మంత్రి.. ఆ క్రమంలో ఎమోషనల్ అయ్యి ఏడుపు ను నియంత్రించుకోలేక కాసేపు మౌనంగా ఉండిపోవడం కూడా అనేక డిస్కషన్స్ కు తావిచ్చింది.
పెందుర్తి కి అమర్
ఈ నేపథ్యంలో తాజాగా అమర్ కు అనకాపల్లి జిల్లా పెందుర్తి నుంచి పోటీ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. మంత్రి అమర్నాథ్‌కి పెందుర్తి అసెంబ్లీ టికెట్ కేటాయించినట్టు పార్టీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమర్‌ను ఒకానొక సమయంలో అనకాపల్లి పార్లమెంట్ కు పోటీ చేయించాలని చూసిన పార్టీ హైకమాండ్ చివరకు పెందుర్తిలో సర్వే చేయించి సానుకూల ఫలితం రావడంతో ఆ అసెంబ్లీ టికెట్ ఖరారు చేసిందన్న ప్రచారం జరుగుతోంది.
అమర్ తాత, తండ్రులు కూడా పెందుర్తి నుంచి ఎమ్మేల్యేలు గా ఎన్నికైన చరిత్ర
పెందుర్తి అమర్ కుటుంబానికి రాజకీయ కార్యక్షేత్రం లాంటిది. అమర్ తాత గుడివాడ అప్పన్న 1978లో పెందుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. తరవాత అమర్ తండ్రి గుడివాడ గుర్నాథ్ రావ్ 1989 – 94, 1994-98 వరకు పెందుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై 1994-98 వరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖా మంత్రి గానూ పనిచేశారు. అమర్ తండ్రి మరణానంతరం 2004 లో పెందుర్తి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన అమర్ తల్లి నాగమణికి కూడా 45 శాతం ఓట్లు అంటే లక్షా 14 వేల ఓట్లు వచ్చాయి. స్వల్ప తేడాతో ఆ ఎన్నికల్లో నాగలక్ష్మి ఓడిపోయింది. తర్వాత రాజకీయంగా అనేక ఇబ్బందులు పడ్డ అమర్.. టీడీపీలో చేరి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 2014 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి అనకాపల్లి ఎంపిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో అనకాపల్లి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించి ప్రస్తుతం మంత్రి గానూ ఉన్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి అమర్ పెందుర్తి నుంచి పోటీ చేస్తే.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ పరిస్థితి ఏంటన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది.