YS Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ.. వివేకా కూతురు సునీత పిటిషన్‌పై సుప్రీం తీర్పు..

|

Nov 29, 2022 | 11:08 AM

వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. వివేక మర్డర్ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేస్తూ నిర్ణయిం తీసుకుంది. వివేకా కూతురు సునీత పిటిషన్‌పై సుప్రీం తీర్పు ఇచ్చింది.

YS Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ.. వివేకా కూతురు సునీత పిటిషన్‌పై సుప్రీం తీర్పు..
Ys Viveka
Follow us on

YS Vivekananda Reddy Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ మరో కీలక మలుపు జరిగింది. ఇన్నాళ్లు ఏపీ కేంద్రంగా జరుగుతున్న విచారణ ఇప్పుడు హైదరాబాద్‌కు బదిలీ అయింది. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కూతురు సునీత వేసిన పిటిషన్‌పై కీలక తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. విస్తృత స్థాయిలో జరిగిన కుట్రపై FIR నమోదు చేయాలని, ఆధారాలను మాయం చేశారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో హైదరాబాద్‌లోని సీబీఐ స్పెషల్‌ కోర్టు ఈ కేసును విచారించనుంది.

కుట్ర, ఆధారాలను మాయం..

ఈ విచారణపై ఆయన కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. సాక్షులను, నిందితులు బెదిరిస్తున్నారని.. కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది. విస్తృత స్థాయిలో జరిగిన కుట్ర, ఆధారాలను మాయం చేయడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం.

కుమార్తె వైఎస్‌ సునీత పిటిషన్‌..

వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె వైఎస్‌ సునీత పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో తీర్పు ఇవ్వనున్నట్లు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వేరే రాష్ట్రానికి కేసు బదిలీపై తీర్పు తర్వాతే సీబీఐ పిటిషన్‌పై విచారణ చేస్తామని స్పష్టం చేసిన ధర్మాసనం.. కేసు విచారణను డిసెంబరు 2కి వాయిదా వేసింది.

సుమారు 140 మంది వరకు సాక్షులు..

సాక్షులను బెదిరిస్తున్నట్లు ఆధారాలు లేవని శివశంకర్‌ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 140 మంది వరకు సాక్షులు ఉన్నారని.. వారందరిని అంత దూరం ఎలా పిలుస్తారని అడిగారు. ఈ ఇష్యూపై సీబీఐనే చెప్పనీయండని ధర్మాసనం అభిప్రాయపడింది.

అటు.. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంలో పిటిషన్ వేశారు. సీబీఐ, వైఎస్ సునీతను ప్రతివాదులుగా చేర్చారు. శివశంకర్‌రెడ్డి తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.

ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది. వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీపై తీర్పు వచ్చిన తర్వాత నిందితుడు గంగిరెడ్డి బెయిల్‌పై విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం