YS Jagan: ఆ విషయంలో ఫుల్ క్లారిటీతో జగన్..! నేతలకు నేరుగానే చెప్పేస్తున్న వైసీపీ అధినేత

| Edited By: Janardhan Veluru

Dec 07, 2024 | 6:23 PM

పార్టీని వీడుతున్న వారిలో పదవులు అనుభవించిన వారు.. తాజాగా కీలక పదవుల్లో ఉన్నవారి సైతం పార్టీని వీడుతున్న నేపథ్యంలో కార్యకర్తలతో నేతలతో భేటీ అవుతున్న జగన్ పార్టీ మారే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సంకేతాలను పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

YS Jagan: ఆ విషయంలో ఫుల్ క్లారిటీతో జగన్..! నేతలకు నేరుగానే చెప్పేస్తున్న వైసీపీ అధినేత
Ys Jagan
Follow us on

పార్టీని వీడే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అధినేత వైఎస్ జగన్ సందేశాన్ని ఇస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు కాకుండా అధికారం లేనప్పుడు పార్టీని అంటిపెట్టుకున్న వాళ్లే నిజమైన కార్యకర్తలు అన్న సంకేతాన్ని పార్టీ శ్రేణుల్లోకి బలంగా పంపేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పదవులు పంపకాలు విషయంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలకు సమన్యాయం చేశామన్న భావనలో జగన్ ఉన్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీలో సీనియర్లుగా ఉన్న వారంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కొందరు పార్టీని వీడగా.. మరికొందరు కూడా ముందు ముందు వైసీపీని వీడుతారన్న ప్రచారం జరుగుతోంది.

పార్టీని వీడుతున్న వారిలో పదవులు అనుభవించిన వారు.. తాజాగా కీలక పదవుల్లో ఉన్నవారి సైతం పార్టీని వీడుతున్న నేపథ్యంలో కార్యకర్తలతో నేతలతో భేటీ అవుతున్న జగన్ పార్టీ మారే వారి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న సంకేతాలను పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఆటుపోట్లు నడుమ ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికారం పక్షం వైపు అడుగులు వేసి ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలోకి ఉన్నామని.. రోజులు ఎప్పుడు ఒకలా ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం లాంటి అంశాల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కీలక నేతలు, కార్యకర్తలు ఇప్పటికి ఉన్నారని హర్షం వ్యక్తంచేస్తున్నారు. కేవలం పదవీ వ్యామోహంతో పార్టీలు మారే వారి విషయంలో ఆందోళన చెందోద్ధంటూ జగన్ భరోసా ఇస్తున్నారు. వైసిపినీ వీడి పోయే వారి విషయంలో ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని జగన్ పార్టీ నేతలకు హామీ ఇస్తున్నారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకునే వారికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఉంటుందని.. తనను కలిసే నేతలకు జగన్ హామీ ఇస్తున్నారు.

పార్టీ వీడుతున్న కీలక నేతలు..

ఎన్నికల ఫలితాలుకు ముందు ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీ సీనియర్లు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు వైసిపికి రాజీనామా చేసి వెళ్లిపోగా ముగ్గురు రాజ్యసభ సభ్యులు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక వారితోపాటు మాజీ మంత్రులు ,మాజీ ఎమ్మెల్యేలు, సైతం వైసీపీకి గుడ్ బై చెప్పి తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీలో ఉన్న మూడు పార్టీలో ఏదో ఒక పార్టీ పంచన చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇబ్బందికరమే.. దీంతోపార్టి భవిష్యత్ ఏంటని వైసీపీ కార్యకర్తలను వేధిస్తోంది. కొందరు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి వెళుతున్న నేపథ్యంలో వారిని అంటిపెట్టుకొని ఉన్న కార్యకర్తలు కూడా గందరగోళానికి గురవుతున్నారు.

Ys Jagan

అయితే పార్టీని వీడే వారి విషయంలో ఆందోళన లేదని.. పార్టీ మారదామనుకున్న వారిని బతిమాడాల్సిన అవసరం కూడా లేదని జగన్ స్పష్టంగా చెప్పేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పదవులు అనుభవించిన వారు.. అధికారం కోల్పోగానే తమధారి తాము చూసుకుంటున్నారని జగన్ భావిస్తున్నారు. పార్టీని వీడాలనుకునే వారిని బుజ్జగించినా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీని అంటి పెట్టుకుని ఉండే వారే అసలైన పార్టీ నేతలు, కార్యకర్తలని పార్టీ సమావేశాల్లో చెప్పేస్తున్నారు జగన్.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలంటే కార్యకర్తలతోనే సాధ్యమవుతుంది తప్ప పదవులు అనుభవించిన నేతలతో కాదని జగన్ బలంగా భావిస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉండటంతో పాటు ప్రతీ కార్యకర్తను నాయకుడిని చేస్తానంటూ ఇప్పటి నుంచే హామీలు ఇచ్చేస్తున్నారు. పార్టీని వీడాలనుకునే వారిని బతిమాలడం, చర్చలు జరపడం లాంటివి చేయమని డైరెక్ట్ గానే సంకేతాలు ఇస్తున్నారు జగన్.