Andhra Pradesh: కాకినాడలో ఓ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ కలకలం సృష్టించింది. కాకినాడ జిల్లా 2 టౌన్ పరిధి వివేకానంద పార్క్ వీధిలో ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు సుబ్రహ్మణ్యం.. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పని చేశాడు. అయితే, రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అనంతబాబు వచ్చి ఆయన కారులోనే తమ అబ్బాయిని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్థరాత్రి 1 గంటల సమయంలో మీ అబ్బాయి టిఫిన్ కోసం బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయాడని, డెడ్ బాడీని ఇంటికి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్సీ చెప్పారని బాధిత కుటంబ సభ్యులు తెలిపారు. అయితే, అనంతబాబు తిరిగి వెళ్తుండగా అడ్డుకోవడంతో కారు వదిలి పరారయ్యాడని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. యువకుడు కాళ్లు, చేతులు విరిచి మట్టిలో దొర్లించి కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ కుమారుడిని చంపేసిన ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.