Konaseema: స్మశాన వాటికకు దారేది.. అంత్యక్రియలు జరపాలంటే ఆ ఊళ్లో ముప్పుతిప్పలే..

|

Jan 01, 2024 | 7:28 AM

అంత్యక్రియలు జరపాలంటే ఆ ఊళ్లో ముప్పుతిప్పలే. పొలాల్లో పంటలు వేస్తే.. గట్లపై.. లేదంటే పొలాల్లోనుంచి మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ దారుణ పరిస్థితి కనిపించింది. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం పంచాయితీ పరిధిలోని ఎర్రగరువు గ్రామంలో శ్మశానవాటికకు వెళ్లేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు స్థానికులు.

Konaseema: స్మశాన వాటికకు దారేది.. అంత్యక్రియలు జరపాలంటే ఆ ఊళ్లో ముప్పుతిప్పలే..
No Route For Burial Ground
Follow us on

స్వాతంత్ర భారతంలో ఇంకా నీరు, తిండి, గుడ్డకే కాదు.. చస్తే పాతిపెట్టడానికి స్థలం కూడా లేక కొందరు అవస్థలు పడుతున్నారు. శ్మశానవాటిక ఉన్నా దానికి వెళ్లేందుకు దారిలేక ఇబ్బందులు పడుతున్నారు. మనిషి బతికినన్ని రోజులూ ఎక్కడైనా, ఏదోలా బతికేయొచ్చు. కానీ అదే మనిషి చనిపోతే అంతిమ సంస్కారాల కోసం జానెడు స్థలం.. ఆ స్థలానికి వెళ్లడానికి దారి తప్పనిసిరి. శ్మశానవాటికకు వెళ్లేందుకు దారిలేని దుస్థితి నెలకొంది అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం పంచాయితీ పరిధిలోని ఎర్రగరువు గ్రామంలో శ్మశానవాటికకు వెళ్లేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు స్థానికులు. గ్రామంలో పోతుల బాబు అనే వ్యక్తి చనిపోతే శ్మశానవాటికకు వెళ్లేందుకు దారి లేక వరిపొలాల మధ్య నుండి ఇబ్బందులు పడుతూ మృతదేహాని మోసుకుంటూ వెళుతున్న దృశ్యం కనిపించింది.

పొలాలను, బురదను దాటుకుంటూ శవాన్ని మోసుకుంటూ వెళ్లారు. భీమ్ నగర్ వాసులు శ్మశానవాటికకు దారి లేక దశాబ్ధ కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గుడుస్తున్నా.. పాలకులు మారుతున్నా.. తమ తలరాతలు మారడం లేందంటూ ఎర్రగరువు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, స్థానిక నాయకులకు శ్మశానవాటిక సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

2వేలమంది జనాభా ఉన్న గ్రామానికి శ్మశాన వాటికకు దారి మాత్రం ఏర్పాటు చేయలేదంటున్న గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్థానిక నాయకులు కళ్ళు తెరిచి శ్మశాన వాటికకు మార్గం కల్పించాలని కోరుతున్నారు గ్రామస్తులు. కొనేళ్లుగా వర్షాకాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వర్షాకాలంలో ఎవరైనా మరణిస్తే ఒక్కరూ ముందుకొచ్చే పరిస్థితిలేదని గ్రామస్థులు వాపోతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..