Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. పొత్తుల అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తుంది. తాజాగా ఇదే వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేశారు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు దివాలాకోరుతనం, లెక్కలేనితనం ప్రస్తుతం కనిపిస్తోందని విమర్శించారు. ‘బీజేపీపై 2019లో తీవ్ర విమర్శలు చేశారు.. ఇప్పుడు పొత్తుల కోసం పాకులాడుతున్నారు’ అంటూ ధ్వజమెత్తారు. ఒక విధానం అంటూ లేకుండా చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు.
అప్పట్లో వైఎస్ఆర్ జాతీయ పార్టీలో ఉండి పొత్తులు పెట్టుకున్నారని గుర్తు చేశారు సజ్జల. ఇప్పుడు జగన్ కూడా చాలా స్పష్టతతో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అద్భుతం జరగడం అంటే జనసేన, టీడీపీలు కలవడమేనని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు సినిమాలో లాగా ప్రతి రీల్ మారుతూ ఉండాలని ఎద్దేవా చేశారు. రాజకీయాలు సినిమా కాదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు సజ్జల. పొత్తు పెట్టుకోవడం విప్లవాత్మకం అంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందని, ఇప్పటి నుండి ప్రజల్లో నాన్చడానికి పొత్తులు అంటున్నారని విమర్శించారు.
చంద్రబాబు జీవితమే పొత్తులు..
చంద్రబాబు జీవితం మొత్తం పొత్తుల మయమేనని విమర్శించారు సజ్జల రామకృష్ణ. మరోవైపు వ్యూహాత్మకంగా పొత్తులు అని పవన్ అంటున్నారని, ప్రజలు అంటే అంత చులకనగా ఉందా అని అన్నారు. ఇక నేను సీఎం అని పవన్ అంటే.. నేను సీఎం అని చంద్రబాబు అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇద్దరు సీఎంలు ఉంటారా? అని విమర్శించారు. ‘చంద్రబాబు ఒకవైపు త్యాగం అంటున్నాడు.. మరోవైపు లీడ్ చేస్తాను అంటున్నాడు.. ప్రజలంటే వీళ్ళకి లెక్కలేని తనం కనిపిస్తుంది.. అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారు. చంద్రబాబు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్ట్ లోనే ఇదంతా జరుగుతుంది. వీళ్ళ బంధం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది. 2019 ఎన్నికల్లో వ్యతిరేక ఓట్లు చీల కూడదని పవన్ ఒంటరిగా పోటీ చేశాడు. రాజకీయ అవసరాలే తప్ప.. ప్రజా ప్రయోజనాలు వీళ్ళకి అవసరం లేదు. పవన్ అంటున్న అద్బుతం వీళ్ళు అంతా కలవడమే అనుకుంటా. పొత్తులు పెట్టుకొకపోతే అసలు రాజకీయ పార్టీయే కాదు అనట్టు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. వీళ్ళ రాజకీయాలు చూస్తుంటే మా పాలన అద్భుతంగా ఉందని అర్థం అవుతుంది. రాష్ట్రంలో ఉన్న కడుపు మంట రాజకీయాలు దేశంలో ఎక్కడా లేవు. ఎన్నికలకు మేము రెడీ అవుతున్నాం. ఏల్లుండి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నాం.’’ అని సజ్జల ప్రకటించారు.