జనసేన వర్సెస్ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ అధినేత, ఏపీ సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తుంటే.. దానికి కౌంటర్ గా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ పర్యటన పెద్ద కాకరేపిన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్రా ద్రోహి పవన్ కళ్యాణ్ అంటూ వైసీపీ, సీఏం జగన్ కు వ్యతిరేకంగా జనసేన నాయకుల పోటీపోటీ నినాదాలు, ప్రచారంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ నాయకులంతా పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతూ.. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనసేన నాయకులు కూడా సీఏం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులపై అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడా, లేక ఫ్యాక్షన్ ముఠా నడుపుతున్నారా అంటూ విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. షూటింగ్ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ విశాఖపట్టణానికి వెళ్లి వస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రయోజనాలే పవన్ కళ్యాణ్ కు ముఖ్యమని, విశ్వసనీయత, నిబద్ధత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ విమర్శించారు పేర్ని నాని.
ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ తాపత్రాయపడుతున్నారని అన్నారు. టీవీల నిండా, పేపర్ల నిండా వార్తలు కావాలి. రేపటి నుండి షూటింగ్‌లకు వెళ్లిపోవాలి. పవన్ కళ్యాణ్ కు మూడు రోజులు ఖాళీ దొరికింది అందుకే విశాఖపట్టణం టూర్ కు వెళ్లారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఒకే మాట మీద నిలబడడని అన్నారు పేర్ని నాని. చంద్రబాబు నాయుడుకు ఒక శాపం ఉందని, ఆయన నోట నిజం వస్తే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు పేర్ని నాని. మూడు కాకపోతే ముప్ఫై పెళ్లిళ్లు చేసుకో.. భరణం ఇస్తున్నావు కదా మాకెందుకు.. కాపోతే నీతి సూక్తులు చెప్పేటప్పుడు ఇలాంటి తప్పులు చేయకూడదని పేర్ని నాని ఎద్దెవా చేశారు.
ఇప్పటికైనా నిబద్దతతో, నీతితో కూడిన రాజకీయాలు చేయాలని హితవు పలికారు. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత లేని వ్యక్తిగా పవన్‌కు గుర్తింపు వచ్చిందని పేర్ని నాని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల గొంతు నొక్కెందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. జనసేన నాయకులు రౌడీలు వలె ప్రవర్తిస్తే ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మంత్రులపై దాడులు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోరా అని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా విజయం వైసీపీదే అని అన్నారు. అందరూ కలిసి వచ్చినా సరే తాము ఒంటిరిగా పోటీచేసి గెలుస్తామని పేర్ని వెంకట్రామయ్య అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..