వైద్యం వికటించి మహిళ మృతి చెందిన విషాద సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. రాజోలు గ్యాస్ కంపెనీ రోడ్డులో శ్రీ చైత్ర హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ నిండు ప్రాణం బలైపోయింది. మృతురాలి బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మలికిపురం మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన కందికట్ల మంగాదేవి (40) అనే మహిళ గర్భసంచిలో కణితి కారణంగా శనివారం మధ్యాహ్నం రాజోలు శ్రీ చైత్ర హాస్పిటల్ కు వచ్చి జాయిన్ అయ్యింది. ఆదివారం ఉదయం ఆమెకు ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ కు తీసుకుని వెళ్లారు. ఎనస్తీసియా(మత్తు) ఇచ్చే సమయంలో ఆమెకు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవ్వడంతో ఆపరేషన్ థియేటర్ లోనే చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు.. విషయం తెలుసుకున్న ఆమె బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మంగాదేవి చనిపోయిందని కుటుంబ సభ్యులు, బంధువులు, వివిధ దళిత సంఘాల నాయకులు ఆసుపత్రి గేటు వద్ద బైఠాయించారు. ఆమె మృతికి కారణమైన డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని, మృతురాలు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతంలో కూడా ఇలాంటి సంఘటలు ఈఆసుపత్రిలో జరిగాయని అనుభవం లేని వారసత్వపు వైద్యం వలనే ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు.
ఇదిలా ఉంటే, మృతురాలి కుటుంబానికి ఆరు లక్షల రూపాయల ఆర్ధిక పరిహారం అందిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలపడంతో వివాదం సద్దుమణిగింది. కానీ, ఈ హాస్పటల్ లో తరచూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు…