
మొదటిరోజు పెద్దూరు వద్ద పోలీసులు అడ్డుకున్నా… నో వే అన్నారు. రెండోరోజు శాంతిపురం మండలంలో తన ప్రచార వాహనాన్ని అదుపులోకి తీసుకున్నా… ఆగేదే లేదన్నారు. మూడోరోజు కూడా రచ్చ అండ్ రచ్చ స్క్వయర్ అన్నట్టుగా సాగింది బాబు కుప్పం టూర్. తన కారవాన్ పైకెక్కి మైకందుకున్నారు. పోలీసులే టార్గెట్‌గా దంచికొట్టారు టీడీపీ అధినేత
ప్రతిపక్ష నేతగా తనకు క్యాబినెట్ హోదా ఉందని, డీఎస్‌పీ స్థాయి అధికారి దగ్గరుండి తన భద్రతా వ్యవహారాలు చూసుకోవాలి అనేది చంద్రబాబు లిటిగేషన్. కొత్త జీవోను నల్లచట్టంతోను, చిత్తుకాగితంతో పోలుస్తూ కుప్పం టూరును కమర్షియల్‌గా వాడుకోవడం మొదలుపెట్టారు టీడీపీ అధినేత. జగన్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని బాబు నిప్పులు కక్కితే… అదే రేంజ్‌లో రియాక్షనిస్తోంది వైసీపీ.
కొత్తగా తీసుకొచ్చిన జీవో నంబర్-1 టీడీపీకే ప్లస్ అవుతోందా… అనే డౌట్లయితే ఇంకా ఇంట్రస్టింగ్. జీవోను అడ్డుపెట్టి రోడ్‌షో ఆపడం వల్ల… జరగాల్సిన రోడ్‌షో కంటే జరగని రోడ్‌షోలతేనే చంద్రబాబుకు ఎక్కువ మైలేజ్ వస్తోందా…? కుప్పంలో కూర్చునే మిగతా 174 నియోజకవర్గాలకూ కావల్సినంత మైలేజ్ సాధిస్తున్నారా? పార్టీ ఇంటిలిజెన్స్ నుంచి వస్తున్న ఇటువంటి ఇన్‌పుట్స్ కూడా జగన్‌ని అలర్ట్ చేస్తోంది. చంద్రబాబుకు తామే ఒక ఆయుధాన్నిచ్చామా అనే అంతర్మథనం వైసీపీలో మొదలైందట. అలాగని బాబు మీద కౌంటర్లెయ్యడం ఆపడం లేదు.
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న చంద్రబాబు విమర్శల్ని తిప్పికొడుతోంది వైసీపీ. రాష్ట్రం మొత్తాన్నీ కుప్పం నుంచే గెలవాలన్న బాబు కలలు సాగవన్నారు విజయసాయిరెడ్డి. అటు బాబు కుప్పం టూరు కొనసాగుతుంటే… ఇటు సోషల్ మీడియాలో కూడా రౌడీ పోలీస్ అనే సబ్జెక్టే బాగా ట్రెండ్ అవుతోంది. వీళ్లు నిజంగా AP పోలీసులేనా? పోలీస్ డ్రెస్ వేసుకున్న రౌడీలా? అంటూ కొన్ని వీడియోలు నెట్లో చక్కర్లు కొట్టాయి. చంద్రబాబును ఏ క్షణంలో ఐనా అరెస్టు చేస్తారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ… అదంతా బూటకం, అరెస్టు వార్తల్లో నిజం లేదు… అంటూ సోషల్ మీడియాలో సంజాయిషీ ఇచ్చుకున్నారు చిత్తూరు జిల్లా పోలీసులు. ఇప్పటికే డీఎస్‌పీని దూషించారు.. సీఐ మీద దాడి చేశారు… అనే అభియోగాలతో చంద్రబాబుపై మూడు కేసులు నమోదయ్యాయి.
జగన్ సర్కారు తీసుకొచ్చిన కొత్త జీవో గురించి ఏపీలో లోతైన చర్చే జరుగుతోంది. నిజానికిది రాజకీయ అంశం మాత్రమే కాదు… పౌరహక్కులకు సంబంధించిన సమస్య. రేపటిరోజున జీతాలు రాలేదని ఉద్యోగులు… పంట నష్టమైందని రైతులు… హక్కుల కోసం కార్మికులు కూడా రోడ్డెక్కినప్పుడు… ఇదే జీవోను అడ్డుగా పెడతారా… అనేవి పబ్లిక్ నుంచి వినిపిస్తున్న మాటలు. సో… ఇది అణచివేత సబ్జెక్ట్ కిందకొస్తుంది గనుక… ప్రభుత్వం వెనకడుగేసినా వెయ్యొచ్చట.
పైకి… తగ్గేదే లే అంటున్నా… లోపల్లోపల మాత్రం… కొత్త జీవోను మళ్లీ సొరుగులోకి తోస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. కందుకూరు, గుంటూరు ట్రాజెడీలపై దర్యాప్తు జరిపి నిజాల నిగ్గు తేల్చకుండా కొత్త జీవోతో కొత్త చిక్కుల్ని తెచ్చిపెడతారా… రోగమొకటైతే మందొకటి వేస్తారా… అనే విమర్శల్ని కూడా కన్సిడర్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. అటు… జీవో రద్దును కోరుతూ కోర్టుకెళ్లే యోచనలో ఉంది జనసేన. కోర్టుల నుంచి మొట్టికాయలు పడే ముందే జాగ్రత్తపడాలన్నది సర్కారీ ఆలోచన. అందుకే… ప్లాన్‌బీని వర్కవుట్ చేస్తోందా? జనవరి 30 వరకు అమల్లో పెట్టి… జనం నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ తీసుకుని… జీవోను కంటిన్యూ చేయాలా వద్దా అనేది ఆ తర్వాతే డిసైడ్ చేస్తారనేది మరో వెర్షన్.