Weather Report: కుండపోత వర్షానికి తడిసిన తెలుగు రాష్ట్రాలు.. మరో మూడు రోజులపాటు వానలు.. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..!

|

Jul 22, 2021 | 9:28 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా జోరు వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి.

Weather Report: కుండపోత వర్షానికి తడిసిన తెలుగు రాష్ట్రాలు.. మరో మూడు రోజులపాటు వానలు.. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..!
Weather Forecasts And Warnings
Follow us on

Weather Forecast Today: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా జోరు వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. మరోవైపు, రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి బలహీనపడింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉమ్మడి నల్గొండ, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. గుంటూరు, శ్రీకాకుళం, కర్నూలు, కడపలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. భారీ వర్షాలతో జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏకధాటి వాన కురుస్తోంది. కుండపోత వానలతో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మోకాళ్ల లోతు నీళ్లలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలు, గ్రామాలు చెరువు, కుంటలను తలపిస్తున్నాయి. నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తారు అధికారులు. ఇన్‌ ఫ్లో 38,419 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ ఫ్లో 49,874 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 694.82 అడుగులుగా ఉంది. నిర్మల్‌ జిల్లా గుండెగాం గ్రామం ముంపునకు గురైంది. రంగారావు పల్సికర్‌ ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌తో గ్రామం జలమయమైంది. గ్రామంలోని ఇళ్లల్లోకి చేరింది వరదనీరు. బాధితులను పునారావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.

మరోవైపు.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌ జలకళతో ఉట్టిపడుతోంది. ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తారు అధికారులు. ఇన్‌ఫ్లో 87 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 66,090 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద కంటిన్యూ అవుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 68,491 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 12,713 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 69.9025 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతోంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 41,503 క్యూసెక్కులుండగా.. ఔట్‌ఫ్లో 3,576 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 62 టీఎంసీలు ఉండగా.. పూర్తిస్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 1,05,230 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,03,990 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 11.114 టీఎంసీలుగా నమోదు అయ్యింది.

హైదరాబాద్‌లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఇటు హైదరాబాద్‌ జంట జలాశయాల్లోకి వరద నీరు భారీగా వస్తోంది. హిమాయత్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 1000 క్యూసెక్కులుండగా.. మూడు గేట్లు ఎత్తారు. హిమాయత్‌సాగర్‌ గరిష్ట నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1762.75 అడుగులుగా ఉంది. ఉస్మాన్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 200 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్‌సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1784.80 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు.

ఇటు విజయవాడలోనూ కుండపోత వాన కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. జనం కాలు బయటపెట్టేందుకు జంకాల్సిన పరిస్థితి నెలకొంది. ఏకధాటి వర్షంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజీకి దగ్గర గోదావ‌రి న‌దికి వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగింది. భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి 9.65 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై 175 గేట్లు స్వల్పంగా ఎత్తి బ్యారేజీ నుంచి 25 వేల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 11,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా,.జలదిగ్భందంలోనే దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ఉన్నాయి. దీంతో గ్రామంలో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

Read Also.. ACB Raids: ఉత్తరాంధ్ర ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి వస్తున్న సంచలనాలు.. మూడు రోజులుగా 12 రెవెన్యూ కార్యాలయాల్లో సోదాలు..!