AP Weather: ఏపీకి మరో వాన గండం.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

|

Sep 19, 2024 | 9:30 PM

ఏపీకి మళ్లీ వాన ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

AP Weather:  ఏపీకి మరో వాన గండం.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Andhra Weather Report
Follow us on

ఏపీకి మరో వాన గండం ముంచుకొస్తోంది. ఈనెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి వ్యాపించి ఉందని.. సెప్టెంబర్ 21న ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ క్రమంలో 23వ తేదీ వరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.  ఏలూరు, పశ్చిమగోదావరి, కాకినాడ, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు,పార్వతీపురం మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

భారీ వర్షాలు, వరదల ధాటికి ఏపీలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొని ప్రజలు అల్లాడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి బయటపడుతున్నారు జనం. ఈ సమయంలో మళ్లీ వాతావరణ శాఖ ఇచ్చిన రెయిన్ అలర్ట్ గుబులు రేపుతోంది.

బుడమేరుపై జలవనరుల శాఖ ఫోకస్‌

బుడమేరుపై జలవనరుల శాఖ ఫోకస్‌ చేసింది. బెజవాడ దుఃఖదాయని అన్న పేరును చెరిపేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆపరేషన్‌ బుడమేరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జలవనరుల శాఖ. విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఈఎన్సీ , SC, ఇరిగేషన్,టౌన్ ప్లానింగ్ , రెవెన్యూ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. విజయవాడ ప్రజలను ముంపు బాధల నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా యాక్షన్‌ ప్లాన్ రూపొందిస్తున్నారు.

బుడమేరు ఎంతమేర ఆక్రమణకు గురైంది. ఎక్కడెక్కడ మరమ్మతులు చేపట్టాలన్న విషయాలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రిపోర్ట్ తెప్పించుకున్నారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్‌ నుంచి ఎనికేపాడు వరకు 36.25 కిలో మీటర్ల పరిధిలో బుడమేరు ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఆక్రమణలను గుర్తించారు.

ఎనకేపాడు నుంచి కొల్లేరువరకు వెళ్లే కాల్వలను విస్తరిస్తామన్నారు జలవనరుల శాఖ మంత్రి. త్వరలోనే పూర్తివివరాలతో నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించాక బుడమేరు ఆపరేషన్‌ను ప్రారంభిస్తామన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి