Andhra Pradesh Elections: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. ఎన్నికలపై పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాలకు కాకుండా.. తాము బలంగా ఉన్న చోట మాత్రమే తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ప్రకటించారు.
కాగా, ఎన్నికల నిర్వహణపై రాష్ట్రంలో భిన్న స్వరాలు వినిపించడంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికలను పెట్టాలని కోరుకుంటున్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేశాక దానికి కట్టుబడి అందరూ సహకరించాలన్నారు. కాగా ఎన్నికల నిర్వహణపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు. ఉద్యోగులు భయపడటంలో అర్థం లేదన్నారు. కరోనాను కేవలం ఒక కుంటి సాకుగా మాత్రమే చూపిస్తున్నాయని ఉద్యోగ సంఘాల తీరును రామకృష్ణ తప్పుపట్టారు.
ఇదిలాఉంటే, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుండే ప్రారంభం కానుంది. అయితే ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు.
Also read:
Spectators: క‌్రికెట్ అభిమానులకు శుభవార్త… స్టేడియంలోకి ఆ మ్యాచ్ నుంచి ప్రేక్షకులకు అనుమతి..?