అది 20 కుటుంబాలు ఉండే ఓ గిరిజన గ్రామం. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా సరే ఇప్పటివరకు ఆ గ్రామానికి మంచినీటి సౌకర్యమే లేదు. అయితే వారి దాహార్తిని తీర్చేందుకు దేవుడే వరమిచ్చినట్లు కొండ కోనల్లో నుంచి ఓ సన్నటి జలధార 24 గంటలు ప్రవహిస్తూనే ఉంటుంది. మండు వేసవిలో సైతం ఆ జలధార అలాగే రావడం అక్కడ విశేషం. ఆ నీటితోనే ఆ గిరిజన వాసులు తాగునీటిగా వినియోగించుకుంటారు. మిగిలిన అన్ని సౌకర్యాలు తీర్చుకుంటారు. ఏలూరు జిల్లాలో విలీన మండలమైన కుక్కునూరు మండలంలో ఉన్న ఈ గ్రామం పేరు గొట్టపు తోగు.
గ్రామం చుట్టూ దట్టమైన అడవి… 20 ఇల్లు మాత్రమే ఉండే ఓ అందమైన పల్లెటూరు అది. ప్రధాన రహదారికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ గ్రామం చేరుకోవాలంటే అయితే ద్విచక్ర వాహనం, లేదంటే నడకదారే గతి. ఇతర రవాణా సాధనాలు లేవు. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన గిరిజనులు గొట్టపుతోగులో నివసిస్తున్నారు. అయితే జలపాతం నుంచి జాలువారే జలధారకు ఓ గొట్టాన్ని అమర్చి ఆ నీటిని పట్టుకుని తమ త్రాగునీటి అవసరాలతో పాటు ఇతర అవసరాలు తీర్చుకుంటున్నారు. కనుకనే ఆ గ్రామానికి గోట్టపుతోగు అనే పేరు వచ్చింది. అయితే అక్కడ బోరు వెయ్యాలన్నా సరే ఎటువంటి నీళ్ల రిగ్గులు కానీ, ఇతర వాహనాలు వెళ్ళలేని పరిస్థితి కారణంగా ప్రభుత్వాలకు అక్కడ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం కష్టమైంది. అయినా అడక్కుండానే దేవుడు వరమిచ్చినట్లు 24 గంటల పాటు ఆ జలధార వస్తూనే ఉంటుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..