
తప్పిపోయిన తనయుడు ఎప్పటికైనా తమ చెంతకు వచ్చి చేరుతాడేమోనన్న ఆశతో ఎనిమిదేళ్లుగా తల్లడిల్లిన ఆ తల్లిదండ్రుల కలకు నిజం చేశారు విజయనగరం జిల్లా పోలీసులు. ఒక మిస్సింగ్ కేసును విజయవంతంగా ఛేదించి, కన్నీళ్లకు ఆనందాన్ని జత చేశారు. గుర్ల మండలం చింతలపేట గ్రామానికి చెందిన పైడిరాజు 2018లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు. అదే ఏడాది గుర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, పలు కోణాల్లో దర్యాప్తు చేసినప్పటికీ అతని జాడ దొరకలేదు. 2019–2020 మధ్య కరోనా మహమ్మారి కారణంగా అతడు తిరిగి వస్తాడన్న నమ్మకం కూడా తల్లిదండ్రుల్లో క్రమంగా మసకబారింది.
అయితే కుమారుడిపై ఉన్న ప్రేమతో వారు ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ కుమారుడి ఆచూకీ తెలుసుకోవాలని వేడుకుంటూనే ఉన్నారు. వారి వేదనను గమనించిన గుర్ల ఎస్‌ఐ నారాయణరావు ఈ కేసును వ్యక్తిగత సవాలుగా స్వీకరించారు. ఉన్నతాధికారుల సూచనలతో పాటు సిబ్బంది మురళి, సురేష్‌లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేసును మళ్లీ దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో పైడిరాజు తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని సురక్షితంగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఎన్నేళ్లుగా కనిపించకుండా ఉన్న తనపై తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారోనన్న భయంతోనే ఇంటికి రాలేదని పైడిరాజు పోలీసులకు తెలిపాడు. పోలీసుల సహకారంతో తల్లిదండ్రుల చెంతకు చేరిన ఆనందం మాటల్లో చెప్పలేనిదని అతడు భావోద్వేగంగా వెల్లడించాడు.
ఈ కేసులో కీలకంగా పనిచేసిన గుర్ల పోలీసుల సేవలకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీ వినియోగం, నిరంతర సమీక్షల వల్లే ఎనిమిదేళ్ల పాత మిస్సింగ్ కేసును పరిష్కరించగలిగామని అన్నారు. ఇలాంటి సేవలు ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని మరింత బలపరుస్తాయని స్పష్టం చేశారు.
Also Read: హోంగార్డు ఇంటిపై ఏసిబి సోదాలు.. కళ్లు బైర్లు కమ్మే నిజాలు