Andhra Pradesh: శభాష్ రుద్ర.. ట్రైన్‌లో కేరళ స్మగ్లర్ల గుట్టరట్టు చేసిన పోలీస్ డాగ్..

గంజాయి స్మగ్లర్లు పక్కా స్కెచ్‌తో రద్దీగా ఉండే ప్యాసింజర్ రైలు ఎక్కారు. పోలీసుల కళ్లు గప్పి గంజాయిని సరిహద్దులు దాటించాలనుకున్నారు. కానీ, అక్కడ సీన్‌లోకి ఎంటరైంది పోలీసు నార్కోటిక్ డాగ్ రుద్ర. ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన రైలు బోగీలోకి దూసుకెళ్లిన రుద్ర.. తన పవర్ ఫుల్ స్మెల్లింగ్ సెన్స్‌తో కేరళకు చెందిన అంతరాష్ట్ర స్మగ్లర్ల గుట్టును రట్టు చేసింది. ఏకంగా 13.5 కిలోల గంజాయిని పట్టించింది.

Andhra Pradesh: శభాష్ రుద్ర.. ట్రైన్‌లో కేరళ స్మగ్లర్ల గుట్టరట్టు చేసిన పోలీస్ డాగ్..
Smart Sniffer Dog Rudra Catches Kerala Smugglers

Edited By:

Updated on: May 21, 2026 | 10:34 PM

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా పోలీసు శాఖకు అండగా నిలిచిన సరికొత్త నార్కోటిక్ స్నిఫర్ డాగ్ రుద్ర తన అద్భుతమైన ప్రతిభతో మొదటి వేటలోనే భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టించి అందరి ప్రశంసలు అందుకుంది. ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన రన్నింగ్ ట్రైన్‌లో గంజాయి వాసనను పసిగట్టి, కేరళకు చెందిన ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లను పట్టుకోవడంలో రుద్ర కీలక పాత్ర పోషించింది. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. ఒడిస్సా బ్రహ్మపురం నుంచి విశాఖపట్నం వైపు ప్రయాణిస్తున్న ఒక ప్యాసింజర్ రైలులో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. చీపురుపల్లి – నెల్లిమర్ల రైల్వే స్టేషన్ల మధ్య రైలు రన్ అవుతున్న సమయంలో పోలీసులు ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులతో పాటు నార్కోటిక్ డాగ్ రుద్ర కూడా పాల్గొంది. రైలులో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉన్నప్పటికీ.. అనుమానాస్పదంగా కూర్చున్న ఇద్దరు వ్యక్తుల వద్దకు వెళ్లగానే రుద్ర అసాధారణంగా స్పందించింది. వారి వద్ద ఉన్న బ్యాగులను గట్టిగా పట్టుకుని పోలీసులను అలర్ట్ చేసింది. రుద్ర ఇచ్చిన సిగ్నల్‌తో అప్రమత్తమైన పోలీసులు సదరు వ్యక్తుల బ్యాగులను తెరిచి చూడగా.. అందులో మూడు పొట్లాలుగా ప్యాక్ చేసిన సుమారు 13.5 కిలోల బరువున్న 14 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి.

కేరళ స్మగ్లర్ల అరెస్ట్

పట్టుబడిన నిందితులను కేరళ రాష్ట్రానికి చెందిన అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లుగా పోలీసులు గుర్తించారు. వీరు ఒడిస్సా నుంచి గంజాయిని కొనుగోలు చేసి రైలు మార్గంలో తరలిస్తున్నట్లు తేలింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం కేసును పలాస జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు.

మంగళగిరిలో స్పెషల్ ట్రైనింగ్..

రాష్ట్రంలో గంజాయి రవాణాను పూర్తిగా నిర్మూలించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకు నార్కోటిక్ డాగ్‌లను కేటాయించారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా మంగళగిరిలో గంజాయి, డ్రగ్స్ గుర్తింపుపై ప్రత్యేక శిక్షణ పొందిన రుద్ర ఇటీవలే విజయనగరం జిల్లా పోలీసు విభాగానికి చేరింది. జిల్లాకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే, తన మొదటి టాస్క్‌లోనే ఇంతటి భారీ గంజాయిని పసిగట్టి సామర్థ్యాన్ని నిరూపించుకోవడంతో పోలీసు శాఖలో హర్షం వ్యక్తమవుతోంది. విధి నిర్వహణలో అద్భుత ప్రతిభ కనబరిచిన నార్కోటిక్ డాగ్ రుద్రను, దాని హ్యాండ్లర్‌ను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. రుద్ర ప్రతిభను గుర్తిస్తూ, దాని ప్రత్యేక అవసరాల కోసం రూ.500 నగదు రివార్డును కూడా ఎస్పీ ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ డాగ్ చేసిన సాహసం విజయనగరం జిల్లా వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Follow Us