విజయనగరం జిల్లాలో గంజాయి అరికట్టాలని పోలీసులు చేస్తున్న తనిఖీల్లో అనేక అక్రమ వ్యాపారాలు బయటపడుతున్నాయి. అలా జిల్లాలో వెలుగులోకి వచ్చిన వ్యాపారాల్లో బంగారం అక్రమ రవాణా కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయనగరం జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గంజాయి అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చాలని పక్కా ప్రణాళికలతో వర్కవుట్ చేస్తున్నారు. అందులో భాగంగా వాహన తనిఖీలు, జిల్లావ్యాప్తంగా వివిధ లాడ్జిల తనిఖీలతో అక్రమ గంజాయి రవాణాదారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లను అరెస్టు చేయగా జిల్లాలో నిఘా మరింత పెంచారు. అలా పోలీసులు చేస్తున్న విస్తృత తనిఖీల్లో అనేక అక్రమ వ్యాపారాలు కూడా బయటపడుతున్నాయి బొబ్బిలి మండల కేంద్రంలో పోలీసులు లాడ్జిలో తనిఖీలు జరుపుతుండగా రైల్వే స్టేషన్ సమీపంలోని సూర్య లాడ్జిలో ఓ ఇద్దరు యువకులు అనుమానస్పదంగా కనిపించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారి వద్ద జిగేల్ జిగేల్ మనే పలు రకాల వస్తువులతో కూడిన నాలుగు కేజీల బంగారం బయటపడింది.
ఆ బంగారం గురించి ఆరా తీయగా తాము రాజస్థాన్ నుండి వచ్చి గుంటూరులో బంగారం వ్యాపారం చేస్తున్నామని, అలా గుంటూరు నుండి ఉత్తరాంధ్రకు బంగారం తరలించి వివిధ షాపులకు అందజేస్తామని అన్నారు. అయినప్పటికీ వారి మాటలు నమ్మలేని పోలీసులు కేసు నమోదు చేసి బంగారం సీజ్ చేశారు. అనంతరం దర్యాప్తు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. తరువాత జి ఎస్ టి అధికారులకు, ఇన్కమ్ టాక్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న జీఎస్టి, ఇన్కమ్ టాక్స్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా బంగారం అక్రమంగా రవాణా చేసి స్థానికంగా ఉన్న షాపులకు బిల్లులు లేకుండా అక్రమంగా బంగారం ఇస్తున్నట్లు తేలింది. ఇలా చేయడం వల్ల బంగారం నాణ్యత లేకపోవడంతో పాటు ప్రభుత్వానికి కూడా జిఎస్టి రాకుండా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. అంతేకాకుండా వ్యాపారం కోట్లల్లో చేసి ఇన్కమ్ టాక్స్ కు మాత్రం లక్షల్లో వ్యాపారం అయినట్లు చూపించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు.
దీంతో ఈ వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎక్కడెక్కడికి తరలించారు? ఎంత మేర బంగారం ఇచ్చారు? అని అధికారులు ఆరాతీస్తున్నారు. నాణ్యత లేని అక్రమ బంగారం ఇచ్చి అటు కస్టమర్లకు, ఇటు ప్రభుత్వానికి ట్యాక్స్ లు ఎగ్గొట్టి మోసం చేస్తున్నారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి వ్యాపారం చేస్తున్న బంగారం దుకాణం యజమానులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీంతో ఉత్తరాంధ్రలోనే పలు బంగారం షాపుల యజమానులు తమ బండారం బయటపడుతుందేమోనని ఉలిక్కిపడుతున్నట్లు తెలుస్తోంది.. ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎప్పుడు తమపై దాడులు జరుగుతాయోనని బంగారం వర్తకులు టెన్షన్ పడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..