Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సునీల్ కుమార్ యాదవ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సునీల్‌కు ఏ పాపం తెలియదంటున్నారు. పులివెందులలో సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ముందుగా సునీల్ యాదవ్ తల్లి మాట్లాడగా.. ‘‘నా కుమారుడు సునీల్ యాదవ్ కు ఏ పాపం తెలియదు. విచారణ పేరుతో నా కొడుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. 24 గంటల్లో నా కొడుకు ఇంటికి రాకపోతే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటాం.’’ అని అన్నారు.
‘‘వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు నా కొడుకు సునీల్ యాదవ్ ఇంట్లోనే ఉన్నాడు. హత్య జరిగిన తరువాత అందరిలాగా చూడడానికి మాత్రమే వెళ్ళాడు. వాస్తవామానికి మాపై ఆరోపణలు రావడంతో మనస్తాపానికి గురయ్యాం. కుటుంబం మొత్తం కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి గోవా వెళ్ళాం. అక్కడ చనిపోతే మా కుటుంబంపైనే నింద వస్తుందని తిరిగి పులివెందులకు వచ్చాం. వివేకానంద రెడ్డి మాకు దేవుడు లాంటివాడు. వివేకానంద రెడ్డితో నా కొడుకు సన్నిహితంగా మెలిగింది వాస్తవమే. వివేకానంద రెడ్డి మా ఇంటికి 2 సార్లు వచ్చి వెళ్ళారు. అటువంటి మంచి వ్యక్తిని సునీల్ హత్య చేశాడు అనడం అవాస్తవం. వాచ్‌మెన్ రంగయ్యను సీబీఐ అధికారులు బెదిరించి తప్పుడు సాక్ష్యాలు చెప్పించారు. రంగయ్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. రెండున్నర సంవత్సరాలుగా నోరు విప్పని రంగయ్య ఈ రోజే ఎందుకు నోరు విప్పారు.’’ అని ప్రశ్నలు గుప్పించారు.
సునీల్ భార్య లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘సునీల్‌తో నా పెళ్లి జరిగి మూడేళ్లయ్యింది. ఎలాంటి సంతోషం లేదు. మా ఆయనను విచారణ పేరుతో తీసుకెళ్ళి చిత్రవధ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. సీబీఐ అధికారులకు దమ్ము, ధైర్యం ఉంటే అసలైన నేరస్థులను పట్టుకోవాలి. నా భర్తకు డెంగ్యూ జ్వరం వస్తే వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక నా వద్ద ఉన్న బంగారం అమ్మి వైద్యం చేయించుకున్నాం. అలాంటిది మా వద్ద కోట్లు ఉన్నాయని మాట్లాడుకోవడం సమంజసం కాదు. నా భర్తను కావాలనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. నా భర్తకు షుగర్ ఉంది. సీఎం ఊరిలో మహిళను వేధింపులకు గురి చేయడం భావ్యం కాదు.’’ అని బోరున విలపించింది.
ఇక సునీల్ తండ్రి కృష్ణయ్య మాట్లాడుతూ.. ‘‘నా కొడుకుని వివేకానంద రెడ్డికి పాల ఉమాశంకర్ జగదీష్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి వివేకానంద రెడ్డి, సునీల్ సన్నిహితంగా ఉండేవారు. అంతే కానీ ఈ కేసుకు సంబంధించి మాకు గానీ, మా కొడుకు సునీల్‌కు గానీ ఎలాంటి సంబంధం లేదు.’’ అని తెలిపారు.
Also read:
YSR Nethanna Nestham: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రేపే లబ్ధిదారుల అకౌంట్‌లో రూ.24 వేలు..
Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..