స్మార్ట్‌సిటీగా దూసుకుపోతున్న విశాఖలో అభివృద్ధితో పాటు ట్రాఫిక్ పెరుగుతోంది. అంతకు మించి రేసాసురుల ఆగడాలు మరింత శృతిమించుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు మించి రేసింగ్ కల్చర్ విశాఖను వణికిస్తోంది. మిడ్‌నైట్ బలాదూరుగా రోడ్డెక్కి బైక్ రేసింగ్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేయడమే కాకుండా.. దాడులకు పాల్పడుతున్నారు. . ఆర్.టి.సి కాంప్లెక్స్, సిరిపురం, బీచ్ రోడ్, చిన్న వాల్తేరులో రేసింగ్ నిర్వహిస్తూ హల్‌చల్ చేశారు. సైడ్ అడిగిన పాపానికి డ్రైవర్ పై మద్యం మత్తులో దాడికి దిగింది ఈ ముఠా. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అర్ధరాత్రి మొదలు తెల్లవారుజామున 3 గంటల వరకు రేసింగ్‌లు జరుగుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు . ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నా సరే.. ఇలాంటి పోకిరోళ్లను పోలీసులు ఎందుకని పసిగట్టడంలేదు. రేసింగ్‌కు కళ్లెం ఎందుకు వేయడంలేదనేది విశాఖ వాసుల ఆవేదన వ్యక్తం చేశారు.
వీకెండ్ వస్తే చాలు .. స్మార్ట్‌సిటీ రోడ్లపై బైక్ రేసులతో ఈ బ్యాచ్ హల్‌చల్ అంతా ఇంతా కాదు. ఎక్కెడెక్కడి వాళ్లో గ్రూప్ గా జాయిన్ అవుతారు. ఏ ఏరియాలో రేసింగ్ వుంటుందో ముందే ఫిక్స్ చేసుకుంటారు. ఇన్‌స్ట్రా గ్రామ్‌లో మెసేజ్‌లు పాస్ చేసుకొని చీకడపడగానే రేసింగ్‌కు రెడీ అవుతారు. అడ్డొచ్చిన వాళ్లపై దాడి చేయడం ఈ గ్యాంగ్‌ల నైజం. తాజాగా సంచలనం రేపిన కేసులో పోలీసులు 44 మంది నిందితులను గుర్తించారు. 13 మందిని రిమాండ్‌కు పంపారు. బారుల తీరిన ఈ వాహనాలను సీజ్ చేశారు.
పరారీలో ఉన్న నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. పట్టుబడిన వారిలో స్టూడెంట్స్, ఉద్యోగులూ, వ్యాపారులు కూడా ఉన్నారు. బలాదూర్‌గా బైక్ రేసింగ్‌కు తెగబడింది కాకుండా అదేదో గొప్పయినట్టు వీడియోలు ఫోటోలు తీసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టింగ్‌లు పెడుతారు. ఒకడ్ని చూసి ఇంకొడు రేసింగ్‌ల బాటపడుతున్నారు. ఉపేంద్ర అనే వ్యక్తి ఇన్‌స్ట్రా ద్వారా పోకిరీలను ఎంకరేజ్ చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.
రీసెంట్ ఘటనలో బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన వ్యక్తుల్లో హేమంత్, ఉపేంద్ర సహా మరికొందర్ని ఐడెంటీఫై చేశారు. ఉపేంద్రకు ఇన్‌స్టాలో 25వేల మంది ఫాలో అవర్స్ ఉన్నట్టు గుర్తించారు. ఏ అండతో ఈ బరితెగింపు?.. కొత్త కోణం తళుక్కుమన్నది. వీళ్లకు వత్తాసుగా కొందరు పోలీసులపై పొలిటికల్ ప్రెషర్ తెస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కానీ అలాంటి పప్పులుడకవని ఖాకీలు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. తాగిన మత్తులో ఆర్టీసీ డ్రైవర్‌ని చితకబాదిన రేసర్లపై కింద కేసులు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్తో పక్కా ఆధారాలు దొరికాయి. ఎవడెవడు రేసింగ్‌లకు పాల్పడ్డారో డేటా కలెక్ట్ చేశారు పోలీసులు. ఆర్టీసీ డ్రైవర్ దాడి కేసు సహా నగరం నలుమూలలలో రేసారుల బెండు తీసేలా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. రేసింగ్‌లకు పాల్పడితే ఇక అత్తారింటికే దారి.