Sanchaita Gajapathi Raju : అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై స్పందించిన ఆయన, ఈ కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చిందని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు హర్షణీయమన్న చంద్రబాబు.. ఈ తీర్పు వేల మంది ఉద్యోగులకు అండగా నిలిచిందని వెల్లడించారు. ట్రస్టును కాపాడుకున్నారంటూ అశోక్ కు అభినందనలు తెలియజేశారు. ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా సంచయిత గజపతి నియామకాన్ని రద్దు చేస్తూ, చైర్మన్ గా అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వాలు ఇష్టారీతిన అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదన్న విషయం తాజా తీర్పుతో వెల్లడైందని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. న్యాయం మీద అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి స్పష్టమైందని చంద్రబాబు అన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలోని వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలన్న జగన్ దుర్మార్గ ఆలోచనలకు అడ్డుకట్ట పడిందన్నారు.
హైకోర్టు తీర్పు తుగ్లక్ ముఖ్యమంత్రికి చెంపపెట్టు అని అభివర్ణించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కోర్టులో ఇన్నిసార్లు తలదించుకున్నది లేదని చంద్రబాబు విమర్శించారు. ఇకనైనా ముందు వెనుకలు ఆలోచించకుండా జీవోలు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు.
Read also :