Vizag: అప్పన్న హుండీలో 100 కోట్ల చెక్.. బ్యాంక్‌కు పంపి తనిఖీ చేయగా..

| Edited By: Ram Naramaneni

Aug 24, 2023 | 11:13 AM

లక్షా, కోటి  కాదు.. ఏకంగా 100 కోట్ల చెక్‌ను విశాఖ సింహాద్రి అప్పన్న హుండీలో వేశాడు హుండీ లెక్కింపు సందర్భంగా ఆ చెక్ చూసి అధికారులు స్టన్ అయ్యారు. వివరాలు చూడగా.. ఆ చెక్... బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి పేరు మీద ఉంది. అయితే సేవింగ్స్ ఖాతం నుంచి 100 కోట్ల దానం ఇవ్వడంపై ఆలయ అధికారులకు డౌట్ వచ్చింది. దాన్ని బ్యాంకుకు తీసుకెళ్లి చెక్ చేయగా.. అస్సలు ట్విస్ట్ రివీల్ అయ్యింది.  ఏకంగా 100 కోట్లకు చెక్‌  హుండీలో వేసి ఆ భక్తుడి ఖాతాలో కేవలం 17 రూపాయలే ఉన్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. దీంతో ఆలయ సిబ్బంది కంగుతిన్నారు. ఇవాళ బ్యాంక్‌కు అధికారికంగా చెక్ పంపి లిఖిత పూర్వకంగా..అన్ని వివరాలు తీసుకోనున్నారు టెంపుల్ అధికారులు. అతడు ఉద్దేశ్యపూర్వకంగానే హుండీలో చెక్‌ వేసి ఉంటే.. చర్యలు తప్పవన్నారు అధికారులు. 

Vizag: అప్పన్న హుండీలో 100 కోట్ల చెక్.. బ్యాంక్‌కు పంపి తనిఖీ చేయగా..
Cheque
Follow us on

విశాఖ, ఆగస్టు 24:  ఎప్పటిలానే ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీను లెక్కించే ఆ దేవస్థానం అధికారులకు కనిపించిన ఓ చెక్ ఆనందం, భావోద్వేగంతో పాటు షాక్ కు కూడా గురి చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్ల చెక్ కళ్లముందు సాక్షాత్కారం అవగానే పరాకామని సిబ్బంది బిత్తర పోయారు. షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ తరువాత ఉన్నతాధికారులకు తెలియచేశారు. దాంతో ఇప్పటివరకు వందల సంవత్సరాల దేవస్థాన చరిత్ర లో ఎన్నడూ జరగని ఆ వింత పై తొలుత ఉన్నతాధికారులు కూడా అనుమానించలేదు సరికదా ఆ భక్తుడు ఎవరూ తెలుసుకుని స్వయంగా కలిసి ఆహ్వానించి మరోసారి దేవాలయ మర్యాదలతో దర్శనాన్ని కూడా చేయించాలని ప్రణాళికలు వేయడం ప్రారంభించారు.

సింహాచలం వరాహాలక్ష్మి నర్సింహ్మ స్వామి హుండీ ప్రతీ 15 రోజులకు ఒకసారి లెక్కింపు జరుగుతూ ఉంటుంది. అలానే హుండీ లెక్కింపు సందర్భంగా ఒక భారీ విరాళాన్ని గుర్తించారు పరకామని సిబ్బంది. దేవస్థాన చరిత్ర లో ఇప్పటివరకు అంత విరాళం ఎప్పుడూ రాకపోవడం, 100 కోట్ల భారీ విరాళం కావడం తో షాక్ కు గురయ్యారు అధికారులు. ఆ తర్వాత కాసేపటికి తేరుకుని వివరాలు సేకరించే పనిలో పడ్డారు

సేవింగ్స్ అకౌంట్ లో 100 కోట్లా ఆన్న అనుమానం

షాక్ నుంచి తేరుకున్న కాసేపటికి అసలు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. దానిపై ఉన్న వివరాలను బట్టి బొడ్డేపల్లి రాధాకృష్ణ కు చెందిన సేవింగ్స్ అకౌంట్ గా గుర్తించారు. ఎంవీపీ డబుల్ రోడ్డు బ్రాంచ్ పేరుతో చెక్ నెంబర్ ఉంది. సేవింగ్స్ అకౌంట్ నుంచి 100 కోట్ల విరాళం ఇవ్వడం పై టెంపుల్ అధికారులకు అనుమానం వచ్చింది. అందులోనూ చెక్ పై వరాహ లక్ష్మీ నరసింహ దేవస్థానం పేరుతో రాసిన ఆ చెక్ పై మొదట 10 రూపాయలు అని రాసి కొట్టేసి మళ్లీ 100 కోట్లు అని రాసి ఉన్నట్టు గుర్తించాక అందరిలో ఉత్సుకత తో పాటు అనుమానం కూడా కలిగింది.

అకౌంట్ లో 17 రూపాయలే

హుండీ లో 100 కోట్ల చెక్ వ్యవహారం ఆ నోటా, ఈ నోటా పడి చివరకు మీడియా దృష్టికి వచ్చింది. వెంటనే బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయించారు కొందరు మీడియా ప్రతినిధులు. అక్కడ ఇంకోసారి షాక్ కు గురికావడం ఈ సారి అందరి వంతైంది. ఆ అకౌంట్ లో కేవలం 17 అంటే అక్షరాలా పదిహేడు రూపాయలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇది ఆకతాయి పనా, లేక మతిస్థిమితం కోల్పోయి అలా చేసి ఉండొచ్చా ఆన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు తాజాగా.

నేడు బ్యాంక్ కు అధికారికంగా చెక్ పంపనున్న దేవస్థానం

అయితే చెక్ హోల్డర్ వివరాలను అధికారికంగా కనుక్కునెందుకు చెక్ ను నేడు బ్యాంక్ కు అధికారికంగా పంపి పూర్తి వివరాలు తీసుకోవాలని నిర్ణయించారు టెంపుల్ అధికారులు. దాన్ని బట్టి ఆ వ్యక్తి వివరాలు కనుక్కుని అతనిని సంప్రదించి ఆకతాయి పనైతే పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఆలయ అధికారులు ఉన్నట్టు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి.