శిరోముండనం కేసులో కొత్త ట్విస్ట్‌.. ప్రసాద్ చెప్పేవన్ని అబద్దాలే

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి శిరోముండనం కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధితుడు ప్రసాద్ చెప్పే విషయాలన్నీ అబద్ధాలని ప్రమాదంలో కాళ్లు విరిగి గాయపడ్డ విజయ్ బాబు వెల్లడించారు.

శిరోముండనం కేసులో కొత్త ట్విస్ట్‌.. ప్రసాద్ చెప్పేవన్ని అబద్దాలే

Edited By:

Updated on: Jul 25, 2020 | 11:40 AM

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి శిరోముండనం కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధితుడు ప్రసాద్ చెప్పే విషయాలన్నీ అబద్ధాలని ప్రమాదంలో కాళ్లు విరిగి గాయపడ్డ విజయ్ బాబు వెల్లడించారు. ఘటన సమయంలో తనకు మాత్రమే ప్రమాదం జరిగిందని విజయ్‌ తెలిపారు. ఆ రోజు రాత్రి ప్రసాద్, తాను, మరికొంత మంది కలిసి రాత్రి 7.30 వరకు మద్యం సేవించామని.. ఆ తర్వాత తాను బైక్‌పై ఇంటికి వెళ్తుంటే అదుపుతప్పి పడిపోయానని విజయ్‌ అంటున్నారు. ఈ ఘటనలో తన కాలు విరిగిందని, బంధువుల సాయంతో ఆసుపత్రికి వెళ్లాలని విజయ్‌ చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా తనకు ప్రమాదం జరిగినప్పుడు ప్రసాద్ అక్కడ‌ లేడని, ఇప్పటివరకు తన దగ్గరకు ఎవరూ రాలేదని విజయ్ తెలిపారు. అయితే తనకు జరిగిన ప్రమాదాన్ని ఒక లారీ గుద్దినట్లుగా చిత్రీకరిస్తూ.. లారీ ఆపి గొడవ చేసినట్లు ప్రసాద్ చెప్తున్నాడని విజయ్ ఆరోపించారు. వారి గొడవలను కప్పిపుచ్చే ప్రయత్నంలో తన ప్రమాదాన్ని, కులాన్ని వాడుకుంటున్నారని విజయ్ మండిపడ్డారు. తాను ఒక దళితుడినని.. దళితనాయకుడైన హర్షకుమార్‌పై గౌరవముండేదని, కానీ కులం పేరుతో రాజకీయాలు చేయడం దారుణమని పేర్కొన్నారు. లారీ ఢీకొట్టడం వలనే గొడవ మొదలైంది అనేది నిజమే అయితే మరి ఇప్పటివరకు ఏ నాయకులు తనను పరామర్శించడానికి రాలేదని విజయ్ ప్రశ్నించారు.