ఏపీలో మూడు పోర్టులు, ఏడు షిప్పింగ్‌ హార్బర్లు

| Edited By:

Jul 05, 2020 | 8:30 AM

ఏపీలో మూడు మేజర్‌ పోర్టులు, ఏడు షిప్పింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు.

ఏపీలో మూడు పోర్టులు, ఏడు షిప్పింగ్‌ హార్బర్లు
Follow us on

ఏపీలో మూడు మేజర్‌ పోర్టులు, ఏడు షిప్పింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో పోర్టు నిర్మాణంతో పాటు దానికి అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన భూముల కోసం గౌతంరెడ్డితో పాటు జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ శనివారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రావూరు, చేవూరు గ్రామాల్లో కొన్ని భూములు, వాటికి సంబంధించిన మ్యాప్‌లను జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌తో కలిసి ఈ ఇరువురు పరిశీలించారు.

అనంతరం గౌతంరెడ్డి మాట్లాడుతూ.. పోర్టు నిర్మాణానికి 3,200 ఎకరాలు, పరిశ్రమల ఏర్పాటుకు 2,000 ఎకరాలు మొత్తం 5,200 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించామని అన్నారు. రామాయపట్నం పోర్టును నిర్మించేందుకు జపాన్, నెదర్లాండ్‌ దేశాలకు చెందిన పలు కంపెనీలు ఆసక్తితో ఉన్నాయని తెలిపారు. పోర్టుతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు భూమిని కేటాయిస్తే ముంబై, ఢిల్లీ నగరాల స్థాయిలో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కంపెనీలు చెబుతున్నట్లు వివరించారు. దీనికి సంబంధించి త్వరలో డీపీఆర్‌లు సిద్ధం చేసి ఆగస్టు 15 నాటికి టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఒకేసారి 5,200 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్‌కు సూచించారు.