Vizag: జువైనల్‌ హోమ్‌లో ఏం జరుగుతోంది.. ఆ బాలికలు ఎందుకు అలా ప్రవర్తించారు..?

విశాఖ జువైనల్‌ హోంలోని బాలికలు ప్రహరీ గోడ దూకి బయటకు వచ్చిన ఘటన కలకలం రేపింది. జువైనల్‌ హోంలో వేధిస్తున్నారని బాలికలు రోడ్డుపైకి వచ్చిన ఆందోళనకు దిగారు. నిద్ర మాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాలికలను లోపలికి పంపారు.

Vizag: జువైనల్‌ హోమ్‌లో ఏం జరుగుతోంది.. ఆ బాలికలు ఎందుకు అలా ప్రవర్తించారు..?
Juvenile Home

Updated on: Jan 23, 2025 | 8:17 AM

విశాఖలోని జువైనల్‌ హోమ్‌లో ఏం జరుగుతోంది. సిబ్బంది తమను వేధిస్తున్నారంటూ అక్కడి బాలికలు ఎందుకు ఆందోలనకు దిగారు.. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ బాలికల పరిశీలన గృహంలో ఉంటున్న కొందరు మైనర్లు.. బుధవారం ఆ భవనం గేట్లు ఎక్కి నినాదాలు చేశారు. అదే సమయంలో బాలికల కుటుంబసభ్యులు కూడా కొంతమంది అక్కడకు రావటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

సమాచారం తెలుసుకుని వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాలికలకు నచ్చజెప్పి మళ్లీ హోమ్‌లోపలికి పంపించారు. అయితే, ఆందోళనకు దిగిన ఐదుగురు బాలికలు మానసిక చికిత్స పొందుతున్నారని చెప్పారు హోమ్‌ సూపరింటెండెంట్‌ సునీత. వారు వైద్యులు సూచించిన మందులు తీసుకోకుండా.. తమను బయటకు పంపించేయాలని గొడవ చేస్తున్నారని.. ఈ వ్యవహారాన్ని అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. వేధింపుల్లాంటివి ఏమీ లేవనేది ఆమె వాదన.

ఈ ఘటనపై వెంటనే స్పందించారు హోంమంత్రి అనిత. హోమ్‌లోని బాలికలు చేసిన ఆరోపణల్లో నిజమెంతో తేల్చాలంటూ విశాఖ పోలీస్ కమిషనర్, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మహిళా పోలీసు, తహసీల్దార్‌ నేతృత్వంలో ఆరోపణలపై బాలికలతో మాట్లాడాలని ఆదేశించారు. బాలికల ఆరోపణలపై తక్షణమే విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వేధింపులు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనిత.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.