సంక్రాంతి పండగ వచ్చిందంటే… పిండివంటల గుమగుమలు తెలుగువారింట నోరూరిస్తూ ఉంటాయి. మిగతా వంటకాల మాట ఎలా ఉన్నా,.. అరిసెలు, బూరెలు లాంటి వంటకాలు మాత్రం పక్కాగా ఉంటాయి. ఎందుకంటే అవి తియ్యటి ఆనందాలు పంచే బెల్లంతో తయారు చేస్తారు కాబట్టి. ఇక ఆ వంటకాల్లో వాడే బెల్లం స్వచ్ఛంగా ఉంటే.. దాని టేస్ట్ ఇక చెప్పనక్కర్లేదు. అలాంటి వారి కోసమే అనకాపల్లి జిల్లాలో రైతు కుందల బెల్లాన్ని తయారు చేస్తున్నారు. రుచిలో మేటి… స్వచ్ఛతలో నేనే సాటి అంటున్న ఆ కుందెల బెల్లం ప్రత్యేకత ఏంటో ఒకసారి తెలుసుకుందామా..?!
బెల్లంకు అనకాపల్లి ప్రసిద్ధి. ఏపీలో ఇక్కడి బెల్లం అంటే ఓ ప్రత్యేకత. ప్రాచుర్యం కలిగిన అనకాపల్లి బెల్లం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకే కాదు.. విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటుంది. ఆసియాలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్ అంటే అనకాపల్లిదే. చాలావరకు బెల్లం నిలువ ఉంచేందుకు… వాటి సారాన్ని అనుగుణంగా కొంతవరకు రసాయనలు వాడుతూ ఉంటారు. కానీ అనకాపల్లి జిల్లాలోని కే కోటపాడులో మాత్రం సంక్రాంతి సీజన్లో బెల్లం కోసం క్యూ కొడతారు. ఎందుకంటే అక్కడ స్వచ్ఛమైన బెల్లాన్ని ఓ రైతు తయారు చేస్తుంటాడు. కుందెల్లో పాకాన్ని పోసి మేటి రకం బెల్లాన్ని సిద్ధం చేస్తారు. అందుకే సంక్రాంతి పండుగ వచ్చిందంటే… పిండి వంటకాలు రుచి తెలియాలంటే ఇక్కడి బెల్లం వాడాల్సిందే.
కే కోటపాడు కుందెల బెల్లానికి ఒక ప్రత్యేకత ఉంది. తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన వీరన్న రైతు.. ఇక్కడ కుందెల బెల్లాన్ని తయారు చేస్తూ ఉంటాడు. సంక్రాంతికి స్పెషల్‌గా చెప్పుకునే ఈ స్వచ్ఛమైన బెల్లానికి 16 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతి ఏటా ఈ కుందెల బెల్లాన్ని తయారు చేయడం… జనం బెల్లం కోసం బార్లు తీరడం ఈ సీజన్లో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఈ బెల్లాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే దీని రుచి అలా ఉంటుంది అట. అంతేకాదు ఇక్కడ బెల్లాన్ని తీసుకెళ్లి వ్యాపారస్తులు కూడా అమ్ముకుంటూ ఉంటారు ఈ సీజన్లో.
కిలో ఒక గడ్డ చొప్పున ఈ కుందెల బెల్లం అందుబాటులో ఉంటాయి. ఇక్కడ తయారుచేసిన బెల్లం ధర బయట 50 నుంచి 60 రూపాయలు ధర పలుకుతుండగా.. కే కోటపాడులో మాత్రం వీరన్న దాన్ని 40 అందిస్తుంటాడు. ప్రతి ఏటా ఇక్కడ కుందెల బెల్లాన్ని కొనుగోలు చేయడమే కాదు… సరదాగా వచ్చి వీరన్నకు పలకరించి అభిమానులు చాలా మంది ఉంటారు. ఇదండీ కే కోటపాడు లోని సంక్రాంతి స్పెషల్ కుందెల బెల్లం ప్రత్యేకత.
—-ఖాజా, వైజాగ్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..