Andhra Pradesh: వల బలంగా అనిపిస్తే ఈ రోజు పండగే అనుకున్నారు.. తీరా బయటకు తీశాక అవాక్కు..

సాధారణంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు చేపలు చిక్కడం సహజం. ఒక్కోసారి వింత వింత చేపలు, రకరకాల రూపాల్లో మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి.

Andhra Pradesh: వల బలంగా అనిపిస్తే ఈ రోజు పండగే అనుకున్నారు.. తీరా బయటకు తీశాక అవాక్కు..
Representative image

Updated on: Mar 21, 2022 | 1:29 PM

Vizag: సాధారణంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు చేపలు చిక్కడం సహజం. ఒక్కోసారి వింత వింత చేపలు, రకరకాల రూపాల్లో మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి. విశాఖ జిల్లాలో మాత్రం చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఓ భారీ కాయంతో ఉన్న తిమింగలం చిక్కింది. తొలుత తెలియక.. భారీ స్థాయిలో వలకు చేపలు పడ్డాయని ఆనందంతో ఉన్న మత్స్యకారులు.. వలతో ఒడ్డుకు వచ్చేసరికి అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. విశాఖ జిల్లా పరవాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన కొంత మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. అచ్యుతాపురం మండలం(Atchutapuram Mandal )లోని తంతడి శివారు వాడపాలెం సమీపంలోని సముద్రం వద్ద వేటకు వెళ్లారు. అక్కడ వల వేయగా, ఏదో బరువైనది చిక్కినట్లు అనిపించింది. దీంతో భారీ చేప పడి ఉంటుందని సంబరపడ్డారు ఆ మత్స్యకారులు. అదృష్టం కలిసి వచ్చిందని అనుకున్నారు. ఎంత శ్రమించినా వలను పడవలోకి లాగలేకపోయారు. చివరకు పడవలో ఉన్న తాడును కట్టి చెమటోడ్చి ఎలాగోలా తీరానికి చేర్చారు. తీరా చూస్తే అది భారీ తిమింగలం. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన మత్స్యకారులంతా దాన్ని చూసేందుకు తరలి వచ్చారు.

చిక్కిన ఈ తిమింగలం బరువు సుమారు వెయ్యి నుంచి 12 వందల కిలోల వరకు ఉంటుంది. దీనిని మత్స్యకార పరిభాషలో పప్పరమేను అంటారట. ఇది తినడానికి పనికి రాదని, కానీ దీని నుంచి వచ్చే నూనెలో చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుందని స్థానికులు వివరించారు. పట్టుబడిన తిమింగలం ప్రాణాలతో ఉండటంతో గుర్తించిన మత్స్యకారులు దానిని తిరిగి సముద్రంలోనికి వదిలేశారు. వాస్తవానికి సాంప్రదాయ మత్స్యకారులకు ఇంత భారీ తిమింగలం చిక్కడం చాలా అరుదు. అనారోగ్యం కారణమో, లేక గాయపడి ఉండటంతోనో ఈ భారీ చేప చిక్కి ఉంటుందని స్థానికులు అంటున్నారు.

ఖాజా, వైజాగ్

Also Read: Telangana: తెల్లారితే తమ్ముడికి, ఆడపడుచుకి పెళ్లి.. ఊహించని పని చేసిన వివాహిత

ఇంకా గృహప్రవేశం కూడా అవ్వని ఇంట్లో దొంగతనం.. ఏమి ఎత్తుకెళ్లారో తెలిస్తే మైండ్ బ్లాంక్