చిన్నారిపై హత్యాచారం కేసులో చిత్తూరు మొదటి అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు మహ్మద్ రఫీని దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పును ప్రకటించింది. ఈ తీర్పును మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట హరనాధ్ వెల్లడించారు. ఈ తీర్పును హైకోర్టుకు పంపుతామని.. దోషికి ఎప్పుడు ఉరితీయాలన్నది హైకోర్టు నిర్ణయిస్తుందని న్యాయమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా మహ్మద్ రఫీ చేసినది హీనమైన చర్యగా పేర్కొన్న న్యాయవాది.. దానికి మరణ శిక్ష సరైందని వ్యాఖ్యానించారు. ఏపీలో పొక్సో చట్టం కింద ఉరిశిక్ష పడ్డ తొలి కేసు ఇదే కావడం విశేషం.
అయితే గతేడాది నవంబర్ 7 న కురబలకోట మండలం చేనేత నగర్‌లోని జరిగిన ఓ శుభకార్యానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన 6ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చాడు రఫీ. మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన రఫీ, లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నవంబర్ 16న నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో హత్య, పొక్సో చట్టం కింద రఫీపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదికను పరిశీలించి 17 రోజుల్లోనే రఫీపై మదనపల్లి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా మొత్తం 41 మంది సాక్షుల విచారించారు. ఇక కోర్టు వాదనలు వినే సమయంలో తన కుటుంబం దిక్కులేనిది అవుతుందని మహ్మద్ రఫీ జడ్జికి చెప్పాడు. అయితే అతడు చేసిన దారుణం దృష్ట్యా ఉరిశిక్షనే సరైందని న్యాయవాది తీర్పును ఇచ్చారు.
మరోవైపు ఈ తీర్పుపై బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులకు తమకు న్యాయం జరిగిందని బాలిక తల్లి అన్నారు. తమలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు.