ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన ఖరారైంది. సీఎం రేపు యాదాద్రిని దర్శించనున్నారు. శరవేగంగా కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు ఆలయ పనులకు సంబంధించిన నివేదికను కూడా సిద్ధం చేస్తున్నారు. ఆలయ పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష కూడా నిర్వహిస్తారు. ఆలయ పనుల్లో అధికారులకు సలహాలు, సూచనలు చేయనున్నారు.
యాదాద్రి ఆలయన పునర్ నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఆలయ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సీఎం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో కేసీఆర్ యాదగిరిగుట్టలో పర్యటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్తున్నారు. దేశంలో అద్భుతమైన పర్యాటక పుణ్యక్షేత్రంగా యాదాద్రిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులు త్వరగా పూర్తి చేస్తోంది. రూ. 1200 కోట్లతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు సంబంధించిన రూ.900 కోట్ల పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. లక్ష్మీనరసింహస్వామి కొలువైన గర్భగుడి చుట్టూ చేపట్టిన పనులు 90 శాతం పూర్తి అయ్యాయి.
ప్రస్తుతం యాదాద్రి ఆలయ తుది దశ పనులు జరుగుతున్నాయి. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు వరుసల రింగ్ రోడ్డు పనులు వేగంగా చేస్తున్నారు. ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన విగ్రహాల అమరిక పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే గర్భాలయ ముఖద్వార తలుపుల పలకలపై బంగారు తాపడం చేసి దేవతా విగ్రహాలు, పద్మాలు, రాజహంసలను అమర్చారు. కాంప్లెక్స్, శివాలయం, పుష్కరిణి పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఆలయానికి నలుదిక్కులా సింహం, ఐరావతం విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దివ్య విమాన రాజగోపురానికి స్వర్ణకాంతులు అద్దనున్నారు. ఇందుకోసం 60కిలోల బంగారాన్ని ఉపయోగించనున్నారు. దీని కోసం రూ.40కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆలయ పునర్ నిర్మాణంలో భక్తులు పాలుపంచుకోవాలి అని, డబ్బు లేదా వస్తు రూపంలో విరాళాలు ఇవ్వాలని ఈవో గీతా ఒక ప్రకటనలో కోరారు.
యాదాద్రి పుణ్య క్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చేలా అద్భుతంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరేలా అక్కడ పచ్చదనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆలయ పనులకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసే పనిలో పడ్డారు.