వివేకా హత్యకేసులో సీబీఐకి కీలక సమాచారం

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ కొత్త విషయాల్ని రాబట్టింది. వివేకా హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్న చెప్పుల షాప్ యజమాని మున్నాకు సంబంధించిన బ్యాంక్ లాకర్‌లోనే 48 లక్షల నగదు, 25 తులాల బంగారం ఉన్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారు.

వివేకా హత్యకేసులో సీబీఐకి కీలక సమాచారం

Edited By:

Updated on: Sep 24, 2020 | 1:49 PM

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ అధికారులు, బుధవారం కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి విచారణతో ఈ కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పులివెందులలో చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి కుటుంబ సభ్యులను విచారించారు. మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ. 48 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు.

ఆ పంచాయితీలో డబ్బు వ్యవహారంతో లింకులున్నాయనే అనుమానంతో కూపీ లాగుతున్నారు. ప్రస్తుతం గుర్తించిన సొమ్ము, సొత్తుతో పాటు మున్నాకి చెందిన మరికొన్ని బ్యాంక్ ఖాతాల్లో కూడా సుమారు 20 లక్షల ఫిక్సడ్ డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించారు. వాటి ఆధారంగానే కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. అతడి ఖాతాల్లో అంత డబ్బు ఎక్కడిది? అనే దానిపై సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు.

మరోవైపు మున్నా స్నేహితులను పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో సీబీఐ అధికారులు విచారించారు. వాళ్లిచ్చిన సమాచారం మేరకు మరికొందరు అనుమానితుల్ని ప్రశ్నించనున్నారు.

గతేడాది మార్చి 15న పులివెందులలోని తన స్వగృహంలో అనుమానాస్పద స్థితిలో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందారు. మొదట గుండెపోటుతో మరణించారనుకున్నప్పటికీ.. ఆ తరువాత హత్యగా తేలింది. దీంతో వివేకా హత్యకేసు విచారణను ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.