AP CM Review on Visakha Projects : భోగాపురం ఎయిర్‌పోర్టు, బీచ్ కారిడార్ ప్రాజెక్ట్, పోలవరం నుంచి గోదావరి జలాలను పైప్ లైన్ ద్వారా విశాఖకు తరలింపు.. ఈ మూడు పనులను శరవేగంగా ప్రారంభించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వీటి తర్వాత మెట్రో ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ ఇప్పుడున్న బీచ్‌రోడ్డు విస్తరణ, అలాగే భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్ రోడ్డు నిర్మాణంపై సమావేశంలో చర్చ జరిగింది.
వీటికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తిచేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. భూసేకరణతో కలుపుకుని భీమిలి నుంచి భోగాపురం వరకూ రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.1,167 కోట్లు ఖర్చు అవుతుందని సమావేశంలో అంచనాకు వచ్చారు. బీచ్ కారిడార్ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదిక చేపట్టాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నాలుగు వారాల తర్వాత మరోసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
అటు, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్‌పైనా సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ గేట్ నుంచి భోగాపురం వరకూ మెట్రో ప్రతిపాదనను సీఎం పరిశీలించారు.. మొత్తంగా 76.9 కిలోమీటర్ల మేర నిర్మాణానికి సిద్ధం చేసిన డీపీఆర్ పై సీఎం సమీక్ష చేశారు. 53 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు రూపొందించారు. దీంతో పాటు 60.2 కి.మీ. మేర ట్రాం కలిపి మొత్తంగా 137.1 కి.మీ. మెట్రో కారిడార్ ప్రతిపాదనలను అధికారులు సీఎం కు వివరించారు. కేవలం మెట్రో నిర్మాణానికి దాదాపు రూ.14వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
ట్రాం సర్వీసులకు మరో రూ.6వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. ట్రాం, మెట్రోల ఏర్పాటుకు మొత్తంగా రూ.20వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. మెట్రో, ట్రాం నిర్మాణ శైలిలో మంచి డిజైన్లు పాటించాలని సీఎం.. అధికారులకు తెలిపారు. ఇవి నగరానికి అందం తీసుకొచ్చేలా ఉండాలని, నగరానికి ఆభరణంలా ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
మరోవైపు, విశాఖ మెట్రో రీజియన్ పరిధిని పెంచుతూ జగన్ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. విశాఖ మెట్రో డెవలప్మెంట్ రీజియన్ పరిధిలోని మరో 13 మండలాలు కలుపుతూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, రవికమతం, బుచ్చయ్య పేట, నాతవరం, సబ్బవరం , దేవరపల్లి, కె కోటపాడు, మాకవరపాలెం, గోలిగుండా, రోలుగుంట, చీడికాడ మండలాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఏజెన్సీ మండలాలు మినహా మిగిలినవన్నీ విఎంఆర్డిఎ పరిధిలోకి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.