
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం సరికొత్త పథకాలను అమలు చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే కృతనిశ్చయంతో పరిపాలనా విధానంలో అనేక మార్పులకు శ్రీకారం చుడుతోంది. అన్ని వర్గాలవారికి చేయూతనందిస్తూ..విభిన్న పథకాలను ప్రవేశపెడుతోంది. తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ(జూలై 29న) 211 రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు 2020-21లో రూ.2,51,600 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కంటే 9.78 శాతం ఎక్కువ రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ సంవత్సరంలో వ్యవసాయరంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలు అందజేస్తామన్నారు. వ్యవసాయ రుణాలు గతేడాది కంటే 11.9 శాతం పెంచుతున్నామన్నారు. 2019-20 రుణ ప్రణాళికలో 99.42 శాతం లక్ష్యం చేరుకున్నామని అధికారులు వెల్లడించారు.
read more: https://tv9telugu.com/can-cow-plasma-cure-covid-patients-285421.html