Vinayaka Chaviti: ఇంకా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతూనే ఉంది… అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్ రానున్నదనే హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీ సర్కార్ వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలను విధించింది. ఇంట్లో , ఆలయాల్లో తప్ప ఎక్కడా వినాయక చవితికి విగ్రహాలను ఏర్పాట్లు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్నూలు లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ వివాదాస్పదమవుతుంది.
జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిలు ఇంట్లో, గుడిలో తప్ప ఎక్కడ కూడా విగ్రహాలు ఏర్పాటు చేయరాదని ఉత్సవాలు నిర్వహించరాదని, నిమజ్జన ఊరేగింపు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. కరోనా నిబంధనల దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాల పై ఆంక్షలు తప్పకుండా పాటించాలని సూచించారు. దీంతో అధికారుల ఆదేశాలను వినాయక నిమజ్జన ఉత్సవ కమిటీ, బిజెపి నేతలు ఖండించారు.
తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత కర్నూలులోనే అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇప్పుడు కరోనా పేరుతో వినాయక భక్తుల పై ఆంక్షలు సరికాదని, ఉత్సవాలకు నిమజ్జన ఊరేగింపు లకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు వినాయక ఉత్సవాలపై బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనున్నది. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే కర్నూలు చేరుకున్న ఏపీ బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ , ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర బీజేపీ నేతలు శివ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డిలు చేరుకున్నారు. ఏపీలో వినాయక చవితి ఉత్సవాలు పై ఆంక్షలపై బిజెపి నేతలు ఖండించనున్నారు.
Also Read: నెల్లూరులో రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. రోడ్డుపైనే కొట్టుకున్న మహిళ, డాక్టర్..