Janasena politics : మార్చి 10 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రతిపక్షాలు ప్రచారం నిర్వహిస్తన్నాయి. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1,500 స్థానాల్లో జనసేన మద్దతుదారులు గెలిచినట్టు స్వయానా జనసేనాని చెప్పడంతో జనసైనికులు మరింత జోష్‌తో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవిళ్లు ఊరుతున్నారు. ఇక పొలిటికల్ హబ్ బెజవాడలో జనసేన గట్టిగానే ప్రచార హోరిని వినిపిస్తుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులకు దీటుగా ప్రచారంలో దూసుకెళ్తుంది.
ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపుతో మార్పు మొదలైందని.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తుతో ఇతర పార్టీలకు చమటలు పట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం విజయవాడ లో ఉన్న 64 వార్డులో జనసేన 37వార్డులో అభ్యర్థులను పోటీలోకి దింపారు. వైసీపీ, టీడీపీ మేయర్ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో జనసేన అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో వైసీపీ , టీడీపీకి చెందని బడ నేతలు సైతం రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారని.. ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన జనసేనని సిద్ధాంతంతో గెలుపు బహుటా ఎగరేస్తామని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీల్లోనూ జనసేన తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పంచాయతీ ఫలితాలను పునరావృతం చేయాలని క్యాడర్‌కు అగ్రనాయకత్వం సూచిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుంటే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసేనా మెల్లమెల్లగా పావులు కదుపుతోంది. 2019 ఎన్నికల తర్వాత స్పీడు పెంచింది.. బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని ఉమ్మడి ప్రణాళికలతో ప్రజా సమస్యలపై పోరాట చేస్తోంది జనసేన. త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికతో పాటూ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే అభ్యర్థులను బరిలో దింపింది. ముందుగా సంస్థాగతంగా క్యాడర్‌ను పెంచుకునేందుకు స్థానికల ఎన్నికలను వాడుకుంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.