
విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖలో… ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక నేతను కూడా ప్రస్తావించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఉత్తరాంధ్ర నేత ప్రస్తుతం పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ లీకులిచ్చారు. సాయిరెడ్డి చెప్పిన ఆ ఉత్తరాంధ్ర నేత ఎవరన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. పేరు చెప్పకపోయినా… ఆ వ్యాఖ్యలు నేరుగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించినవేనన్న చర్చ మొదలైంది. అయితే ఇది కేవలం వ్యక్తిగత విమర్శగా చూడాలా? లేక అప్పటి పార్టీలోని అంతర్గత విషయాలపై సాయిరెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నారా? అన్నది కీలకం. ఎందుకంటే… గతంలో ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్‌గా సాయిరెడ్డి వైసీపీలో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో బొత్స కూడా ఉత్తరాంధ్రలో పార్టీకి కీలక నేతగా ఉన్నారు. ఇద్దరి మధ్య అంతర్గతంగా కోల్డ్‌వార్ నడిచిందన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. అప్పట్లోనే బొత్స ప్రాధాన్యతను తగ్గించేందుకు సాయిరెడ్డి ఇంటర్నల్‌గా పావులు కదిపారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ అప్పట్లో తెరవెనుక జరిగిన పరిణామాలుగానే మిగిలిపోయాయి. అయితే రాజకీయంగా ఇన్ని జరిగినా సాయిరెడ్డి పార్టీని వీడినప్పుడు బొత్స ఎప్పుడూ ఆయనపై విమర్శలు చేయలేదు. సైలెంట్‌గా ఉన్న బొత్స పేరును సాయిరెడ్డి ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు బొత్స జనసేనలోకి వెళ్తారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. అది కేవలం గాలివార్తే. నిజం అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు సాయిరెడ్డి… ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత పార్టీ మారబోతున్నారు” అనడంతో గతంలో జరిగిన ప్రచారాన్ని ఇప్పుడు రాజకీయ వర్గాలు మళ్లీ గుర్తు చేసుకుంటున్నాయి. సరిగ్గా స్థానిక ఎన్నికల టైమ్‌లోనే విజయసాయిరెడ్డి తన లేఖలో ఈ విషయాన్ని ప్రస్తావించడంతో రచ్చ రేపుతోంది. సాయిరెడ్డి చెప్పిన ఉత్తరాంధ్ర నేత ఎవరంటూ బొత్సను ప్రశ్నించగా.. ఆయన కూడా ఘాటుగానే స్పందించారు. సాయిరెడ్డి వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ.. ఆయన కేఏ పాల్-2 అంటూ సెటైర్లు వేశారు.
అయితే విజయిసాయిరెడ్డికి కౌంటర్ ఇస్తూ.. బొత్స తన పేరు తీరు తీసుకురావడంపై కేఏ పాల్ సీరియస్ అయ్యారు. తనను కించపరిచేలా మాట్లాడొద్దని హెచ్చరించారు. విజయసాయిరెడ్డిని తనతో పోల్చడంపై కేఏ పాల్ అభ్యంతరం తెలిపారు. బొత్స వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కేఏ పాల్.. తనను కించపరిచేలా మాట్లాడొద్దని హెచ్చరించారు. తన గురించి మాట్లాడే ముందు గతంలో తన సమావేశాలకు వచ్చి నా ఆశీస్సులు పొందిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ శాంతి కోసం పోరాడుతూ అమెరికాలో ఉన్న తనతో మీకు పోలిక ఏంటి అంటూ కౌంటర్ ఇచ్చారు.
అలా.. విజయసాయిరెడ్డి లేఖతో మొదలైన రచ్చ.. దుమారం రేపుతోంది. అయితే సాయిరెడ్డి ఇంతటి పొలిటికల్ హీట్ క్రియేట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అన్నదే ప్రశ్న..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..