
ఈ రోజుల్లో దొరికిన వస్తువులను తిరిగి యజమానికి అందించడం అరుదైన విషయం. కానీ తిరుపతి జిల్లా వెంకటగిరిలో చదువుతున్న ఐదుగురు చిన్నారులు తమ నిజాయితీతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. చిన్న వయసులోనే వారు చూపిన విలువలు ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. వెంకటగిరి జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌లో 6, 7, 8వ తరగతులు చదువుతున్న ఐదుగురు విద్యార్థినీలు బస్ కోసం బస్‌స్టాప్ వద్ద ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సమయంలో అక్కడ ఒక పర్సు కనిపించింది. ఆసక్తిగా తెరిచి చూడగా అందులో సుమారు 40 గ్రాముల బంగారు నగలు, రూ.50 వేల నగదు ఉండటంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అయితే ఆ డబ్బు లేదా నగలు తమ వద్ద ఉంచుకోవాలనే ఆలోచన కూడా చేయకుండా వెంటనే సమీపంలోని వెంకటగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పర్సును పోలీసులకు అప్పగించారు. తరువాత మళ్లీ బస్ స్టాప్ వద్దకు వెళ్లిన విద్యార్థినీలకు అక్కడ ఓ మహిళ తన పర్సు కోసం వెతుక్కుంటూ కనిపించింది. దీంతో స్పందించిన ఆ చిన్నారులు పర్సు తమకు దొరికిందని, పోలీస్ స్టేషన్‌లో ఇచ్చామని చెబుతూ ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు పరిశీలించి పర్సులోని నగలు, నగదు ఆ మహిళవేనని నిర్ధారించుకుని ఆమెకు తిరిగి అందజేశారు. చిన్నారుల నిజాయితీకి పోలీసులు కూడా అభినందనలు తెలిపారు.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. “చిన్న వయసులోనే మీ నీతి, నిజాయితీ ఆదర్శంగా నిలిచింది చెల్లెమ్మలూ. మీలాంటి పిల్లలు ఉండటం విద్యాశాఖకు గర్వకారణం” అంటూ ట్వీట్ చేశారు.
8వ తరగతి విద్యార్థినీలు బి. గురుప్రియ, బి. గీతిక, ఎం. గీతిక, 6వ తరగతి చదువుతున్న పద్మశ్రీ, 7వ తరగతి విద్యార్థిని హేమలతలు చూపించిన నిజాయితీకి వెంకటగిరి ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బంగారం విలువ ఎంత ఉన్నా, నిజాయితీ ముందు అది చాలా చిన్నదని ఈ చిన్నారులు మరోసారి నిరూపించారు.
Also Read: వేసవి బీరకాయ పంటలో దిగుబడి పెరగాలంటే ఇలా చేయండి..