
అమరావతి, అక్టోబర్ 3: ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు మరో కీలక రైల్వే సౌకర్యం అందుబాటులోకి రానుంది. బెంగళూరు–ముంబయి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలోని అనంతపురం, గుంతకల్లు రైల్వే స్టేషన్లలో హాల్ట్‌లు (రైల్వే స్టాప్‌లు) కల్పించనున్నారు. రాయలసీమ నుంచి బెంగళూరు, ముంబయి తదితర ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగపడనుంది. కేఎస్‌ఆర్ బెంగళూరు–ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), ముంబయి మధ్య వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ నెలలోనే రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వారానికి ఆరు రోజులు ఈ రైలు నడిచేలా ప్రతిపాదనలు ఉన్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
షెడ్యూల్ ప్రకారం.. ముంబయి నుంచి రాత్రి 10:30 గంటలకు బయలుదేరే రైలు.. మరుసటి రోజు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బెంగళూరు సిటీ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబయి చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. మొత్తం ప్రయాణ సమయం సుమారు 16 గంటలు ఉండనుంది. బెంగళూరు–ముంబయి వందే భారత్ స్లీపర్ రైలు మార్గంలో మహారాష్ట్రలోని సోలాపూర్, పుణె, కల్యాణ్, కర్ణాటకలోని రాయచూర్, కలబురగి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఆగనుంది. తిరుగు ప్రయాణంలోనూ ఇదే స్టేషన్లలో హాల్ట్‌లు ఉంటాయి. బెంగళూరు–ముంబయి వందే భారత్‌కు ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురంలో హాల్ట్ ఇవ్వాలని గతంలో డిమాండ్లు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం ప్రతిపాదించిన షెడ్యూల్‌లో ఈ స్టేషన్లకు చోటు దక్కలేదు.
ఈ వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో త్రీ-టైర్, టూ-టైర్, ఫస్ట్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 823 మంది ప్రయాణికులు ప్రయాణించేలా రైలును రూపొందించారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఏపీలో హాల్ట్‌లు కల్పించడంపై రైల్వే మంత్రి సోమన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే రాయలసీమ ప్రాంతం నుంచి బెంగళూరు, ముంబయి, మార్గమధ్యంలోని ఇతర ప్రధాన నగరాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గుంతకల్లు–బెంగళూరు మధ్య మరో ఎక్స్‌ప్రెస్ రైలును త్వరలో ప్రారంభించనున్నట్లు ఎంపీ వెల్లడించారు.