
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం (జూలై 11, 2026) భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివచ్చారు. “గోవిందా.. గోవిందా..” నామస్మరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక, విశిష్ట దర్శన టికెట్లకు భారీ స్పందన లభించింది. అలాగే వేద ఆశీర్వచనం, సుప్రభాతం, కళ్యాణకట్ట సేవలు, ప్రసాదాల విక్రయాలు, ఆన్‌లైన్ సేవలు, విరాళాల ద్వారా ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.
ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం ఒక్కరోజే సుమారు 1,34,457 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వివిధ సేవలు, ప్రసాదాల విక్రయాలు, విరాళాలు, ఆన్‌లైన్ చెల్లింపులు తదితర మార్గాల ద్వారా ఆలయానికి రూ.1,01,09,420 ఆదాయం లభించింది.
ఆలయానికి విచ్చేసిన భక్తుల కోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించింది. 104, 108 వైద్య సేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా మొత్తం 1,340 మంది భక్తులకు వైద్య సేవలు అందించారు.
భక్తుల తాకిడి మధ్య ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. దర్శనం, ప్రసాదాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, భద్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. శ్రీవారి అనుగ్రహంతో రికార్డు స్థాయిలో భక్తులు తరలిరావడం, కోట్ల రూపాయల ఆదాయం సమకూరడం వాడపల్లి క్షేత్ర మహిమను మరోసారి చాటిచెప్పిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.