
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో జరిగిన ఓ చోరీ ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా దొంగతనానికి వచ్చిన వ్యక్తి.. ఎక్కడ డబ్బులు దొరుకుతాయా అని చూస్తాడు. కానీ ఇక్కడ మాత్రం దొంగతనానికి ముందు సాక్షాత్తూ శ్రీవారినే మొక్కుకున్నాడు. తన బాధలు, కష్టాలను వెంకటేశ్వర స్వామికి చెప్పుకున్న తర్వాతే చోరీకి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఘటన చర్చనీయాంశంగా మారింది.
ఉరవకొండ పట్టణంలోని బిగ్ బజార్ సూపర్ మార్కెట్లోకి ఓ దొంగ ప్రవేశించాడు. షాపులో అంతా పరిశీలించిన అనంతరం క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. అయితే అక్కడే అతడికి వెంకటేశ్వర స్వామి నిలువెత్తు ఫొటో కనిపించింది. దీంతో ఒక్కసారిగా అక్కడే ఆగిపోయిన దొంగ.. స్వామివారి ముందు చేతులు జోడించి మొక్కుకున్నాడు. కొద్దిసేపు అక్కడే ఉండి శ్రీవారితో తన బాధలు, కష్టాలు చెప్పుకున్నట్లు కనిపించాడు. విధిలేని పరిస్థితుల్లోనే తాను దొంగతనానికి పాల్పడుతున్నానని చెప్పుకున్నాడో.. తనకు మంచి జాక్‌పాట్ తగలాలని మొక్కుకున్నాడో.. లేక పెద్ద కోరికల చిట్టానే స్వామివారి ముందు పెట్టాడో తెలియదు. కానీ తన మనసులోని మాటలన్నీ చెప్పుకున్న తర్వాత మాత్రం పని కానిచ్చేశాడు. స్వామివారి ఫొటోకు మొక్కుకున్న అనంతరం క్యాష్ కౌంటర్‌లో ఉన్న సుమారు రూ.20 వేల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
దొంగతనం మొత్తం షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. వెంకన్న సాక్షిగా జరిగిన ఈ చోరీని శ్రీవారు చూసీ చూడనట్లు ఉన్నారేమో కానీ.. సీసీ ఫుటేజ్ మాత్రం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన మాత్రం హీరో రవితేజ నటించిన ఖడ్గం సినిమాలోని ఓ పాటను గుర్తు చేస్తోంది. కోరిన వరాలు ఇస్తే ఏడుకొండలను ఏసీ చేస్తానంటూ శ్రీవారిని మొక్కే పాటలోని సన్నివేశాన్ని ఈ దొంగ తీరు తలపించిందంటూ స్థానికులు సరదాగా చర్చించుకుంటున్నారు.